తమ ప్రేమను వ్యక్త పరచడానికి ఈ తరం యువకులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసం సోషల్ మీడియాను తెగవాడేస్తున్నారు. అయితే ఓ ఆకతాయి మాత్రం ఏకంగా ప్రభుత్వ అధీనంలోని ఓ సంస్థ వెబ్సైట్ని హ్యాక్ చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో చోటుచేసుకుంది. తన ప్రేమ ను తెలిపేందుకు ఆ ఆకతాయి ఆ యూనివర్శిటీ వెబ్ సైట్ని వాడేసుకున్నాడు. ఆ వెబ్సైట్లో హ్యాపీ బర్త్డే పూజా అనే పేరు ప్రత్యక్షమయ్యేలా చేశాడు.
మరోవైపు ఈ ఘటనపై యూనివర్శిటీ బృందం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఘటనపై ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. తన ప్రేమను తెలియజేయడానికి ఇదే దొరికిందా.. మరో మార్గం కనిపించలేదా అంటూ స్పందించగా. పూజ అనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకొందరైతే ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థ వెబ్సైట్ని హాక్ చేయడం తప్పు అని ఆ ప్రేమదాసుని కడిగి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ వెబ్సైట్ను తిరిగి అధీనంలోకి తీసుకున్న జామియా యూనివర్శిటీ బృందం తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించింది.