ఆదివారం జరిగిన భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కోసం దేశం మొత్తం ఊపిరి బిగపట్టి టీవీలకు అతుక్కుపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై కొన్నేళ్లుగా ఓటమి అంటే ఎరుగని భారత్‌కు ఈసారి కూడా విజయం ఖాయమని అంతా అనుకున్నారు.
తీరా దాయాది దేశంపై దారుణంగా ఓడిపోవడంతో సర్వత్రా షాక్. ఓడిపోవడం ఆశ్చర్యం కాకపోయినా మరీ ఇంత ఘోరంగా చేతులెత్తేయడంపైనే విస్మయం వ్యక్తమైంది. దీంతో టీమిండియా ప్లేయర్స్ ను క్రికెట్‌లవర్స్ రకరకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూనే..ఏదేమైనా టీమిండియానే గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.
ఇది లాఉంటే తాజాగా కమల్ ఆర్ ఖాన్ కోహ్లీ పై చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తనకు తాను ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకొనే కమల్ ఆర్ ఖాన్ మరోసారి నోరు జారాడు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని జైల్లో వేయాలని, అతడు 130 కోట్ల మంది గౌరవాన్ని తాకట్టుపెట్టాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు విరాట్‌తోపాటు యువీ, ధోనీ అంతా ప్రజలను మోసం చేయడం ఆపేయాలని, అందరూ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించాడు.
ఒక బాల్‌లో క్యాచ్ మిస్సవగానే తర్వాతి బాల్‌నే క్యాచ్ ఇచ్చావని, నువ్వు ఫిక్సింగ్ చేశావన్న విషయం తెలుస్తుందన్న భయం కూడా నీకు లేదా అని మరో ట్వీట్ చేశాడు. అయితే కేఆర్‌కే ట్వీట్స్‌పై ఇటు ఇండియా, అటు పాకిస్థాన్ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
ఆటలో ఓటమి భాగమని, ఇండియా ఫైనల్ వరకు చేరిందన్న విషయాన్ని గుర్తించాలని పాక్ ఫ్యాన్స్ కేఆర్‌కేకు బుద్ధి చెప్పారు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్ అని, ఒక్క మ్యాచ్ ఓడగానే ఇలా నిందించడం తగదని మరో పాక్ అభిమాని ట్వీట్ చేశాడు.