“జై సింహా” 100 రోజుల వేడుక..

278
- Advertisement -

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం “జై సింహా”. సి.కె.ఎంటర్ టైనమెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు. కే.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21తో వందరోజులు పూర్తి చేసుకొంది. ఈ చిత్ర శత దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో అత్యంత ఘనంగా నిర్వహించారు. చిత్రబృందంతో పాటు ప్రత్తిపాటి పుల్లారావు, ఆనంద్ బాబు, ఆంజనేయులు తదితర రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన మరియు చిత్ర యూనిట్ సభ్యుల్లోని ప్రతి ఒక్కరికీ బాలయ్య స్వహస్తాలతో శత దినోత్సవ వేడుక షీల్డ్ ను అందించడం విశేషం. ఇదే సందర్భంలో గుంటూరు జిల్లాకు చెందిన మహిళలు బాలయ్యకు హారతి ఇచ్చి, ఆయన పాదాలకు పువ్వులతో అభిషేకం చేయడం ఆహుతులను అలరించింది.

Jai Simha 100 Days Celebrations

ఈ సందర్భంగా రచయిత రత్నం మాట్లాడుతూ.. “జై సింహా చిత్రం శత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కథను ఒకే చేసిన డేరింగ్ హీరో బాలయ్యకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. అలాగే నా కథను నమ్మిన నా డైరెక్టర్ రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ లకు జీవితాంతం రుణపడి ఉంటాను” అన్నారు.

సంగీత దర్శకుడు చిరంతన్ భట్ మాట్లాడుతూ.. “గౌతమిపుత్ర శాతకర్ణి అనంతరం బాలయ్యతో కలిసి ‘జై సింహా’ చిత్రానికి పనిచేయడం, మళ్లీ విజయాన్నందుకోవడం చాలా ఆనందంగా ఉంది. జానీ మాస్టర్ ‘అమ్మకుట్టి’ సాంగ్ పిక్చరైజేషన్ ఇరగదీశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు” అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. “లెజండ్ తర్వాత బాలయ్యతో చేసిన చిత్రమిది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకదేవుళ్లకు నా ధన్యవాదాలు” అన్నారు.

Jai Simha 100 Days Celebrations

మురళీమోహన్ మాట్లాడుతూ.. “మన ప్రియతమ నాయకుడు నందమూరి బాలకృష్ణ ‘జై సింహా’ విజయోత్సవ శుభాకాంక్షలు. ఆనాటి కొండవీటి సింహానికి పుట్టిన బిడ్డే ‘జై సింహా’. కొన్ని పాత్రలు బాలయ్య మాత్రమే చేయగలరు అనిపించేలా ఆయన కొన్ని పాత్రలతో విశేషంగా అలరించారు. అప్పట్లో యన్.టి.ఆర్ ని “అన్నదమ్ముల అనుబంధం” సినిమా కోసం కలిశాను. నాకు తెలియకుండానే ఆయన కాళ్ళకి నమస్కరించాను. సినిమా విడుదల అనంతరం అందరూ నన్ను యన్.టి.ఆర్ తమ్ముడిగానే గుర్తించేవారు. అసలు ఈమధ్యకాలంలో సినిమాలు 15, 30 రోజులు ఆడడమే గగనమైపోతున్న తరుణంలో.. బాలయ్య సినిమాలు వందరోజులు ఆడడం అనేది ఆయన మాత్రమే సాధించగల ఘనత. ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ లేని విధంగా బ్రాహ్మణుల గొప్పదనాన్ని వివరించడం అనేది అభినందించదగ్గ విషయం. మళ్లీ ‘యన్.టి.ఆర్’ 1000 రోజుల వేడుకలో కలుద్దాం” అన్నారు.

Jai Simha 100 Days Celebrations

చిత్ర కథానాయికల్లో ఒకరైన నటాషా దోషి మాట్లాడుతూ.. “నా పరిచయ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్నందించినందుకు చిత్ర బృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను” అన్నారు.

దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ.. “అసలు 100 రోజుల వేడుకలు అనేవి మర్చిపోతున్న తరుణంలో ‘జై సింహా’తో మళ్లీ ప్రేక్షకులకు గుర్తు చేసినందుకు సంతోషంగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత నా సినిమా 100 రోజుల వేడుకను నేను చూస్తున్నాను. ఈ సందర్భంగా నా యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. కుదిరితే బాలకృష్ణతో మరో సినిమా చేయాలనుకొంటున్నాను” అన్నారు.

Jai Simha 100 Days Celebrations

గుంటూరు ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ.. “యన్.టి.ఆర్ తర్వాత తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. భవిష్యత్ లో ఆయన మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖా మంత్రివర్యులు ఆనంద్ బాబు మాట్లాడుతూ.. “జై సింహా శత దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. యన్.టి.ఆర్ తర్వాత సినిమాల్లో, రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా ఒక్క బాలయ్యకే సాధ్యం. సినిమాలు హిట్ అవుతున్నా ఈమధ్యకాలంలో వందరోజులు ఆడుతున్న సినిమాలు లేవు. అలాంటిది బాలయ్య చిత్రం 4 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం అనేది గర్వకారణం. బాలయ్య మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను” అన్నారు.

మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. “తెలుగు సినిమాకి, ముఖ్యంగా చిలకలూరి పేటకు 100 రోజుల సినిమా ఇచ్చినందుకు మా బాలయ్య బాబుకి, దర్శకులు కె.ఎస్.రవికుమారకి, నిర్మాత సి.కళ్యాణ్‌కు కృతజ్ఞతలు. చిలకలూరిపేటలో బాలయ్య నటించిన 11 సినిమాలు వందరోజులు ఆడడం అనేది గర్వకారణం” అన్నారు.

Jai Simha 100 Days Celebrations

చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. “మా పుల్లారావుని కలిసినప్పుడల్లా మనసు శాంతిగా ఉంటుంది. ఆయన నవ్వుతోనే మన బాధల్ని తీర్చేస్తుంటారు. ఏ హీరో కూడా ఇప్పటివరకు చిలకలూరిపేటలో 100 రోజుల వేడుక చూసి ఎరుగడు. అలాంటిది బాలయ్య 11వ సినిమా ఇక్కడ 100 రోజుల వేడుక జరుపుకోవడం అనేది ఆనందంగా ఉంది. బాలయ్యతో ఇంతకు మునుపు దాసరి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘పరమవీర చక్ర’ అవార్డులు తెచ్చిపెట్టింది కానీ.. రివార్డులు మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది.

నిజానికి “గౌతమిపుత్ర శాతకర్ణి” అనంతరం 101వ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాం. కానీ మా డైరెక్టర్ రవికుమార్ స్క్రిప్ట్ డెవెలప్ మెంట్ కోసం టైం అడగడంతో వేరే ‘జై సింహా’ 102వ సినిమా అయ్యింది. బాలయ్య ఇదే జోరుతో ఏడాదికి నాలుగు సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. ఆయన్ను ఇప్పుడు చూస్తుంటే ఒక పదిహేనేళ్ళ వెనక్కి వెళ్లినట్లుంది. ఆయన తదుపరి చిత్రమైన “యన్.టి.ఆర్” బయోపిక్ అందర్నీ ఆకట్టుకోవడం ఖాయం. మళ్లీ మే నెలలో మరో చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం.. కోరుతున్నాం. ఇక మా సినిమాకి సంబంధించిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన శ్రేయాస్ శ్రీనివాస్ కి కృతజ్ఞతలు” అన్నారు.

Jai Simha 100 Days Celebrations

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ చిలకలూరిపేటలో నాన్నగారు ఎన్నో సినిమాల శత దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇదే చిలకలూరిపేటలో నా 11వ చిత్రం ‘జై సింహా’ 100 రోజుల వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఏమిచ్చి ఇందరి అభిమానుల రుణం తీర్చుకోగలను. నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్న నాకు అనునిత్యం అండగా నిలుస్తున్న నా తెలుగు ప్రేక్షకదేవుళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మరిన్ని మంచి పాత్రలు పోషించడానికి వీరి ఆశీర్వాదాలు నాకు ఉత్సాహాన్నిస్తున్నాయి. ఈ సినిమా విజయం నా ఒక్కడిది కాదు. ఇది సమిష్టి కృషి. సి.కళ్యాణ్ నిర్మాణంలో ‘పరమవీర చక్ర’ అనంతరం ‘జై సింహా’ చిత్రాన్ని చేయడం ఆనందంగా ఉంది.

కథాబలమున్న చిత్రాన్ని తెరకెక్కించే నిర్మాతలు తక్కువవుతున్న తరుణంలో.. ట్రెండ్ బట్టి కాకుండా కథను నమ్మి ఇంత మంచి చిత్రాన్ని నిర్మించారు సి.కళ్యాణ్. రత్నంగారి కథ, చిరంతన్ సంగీతం, అరివి-అంబు, రామ్-లక్ష్మణ్ ల పోరాటాలు, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ, జానీ మాస్టర్ నృత్యాలు వంటి అంశాలన్నీ ‘జై సింహా’ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి. నానుంచి ఏమీ ఆశించకుండా నన్ను ఆదరిస్తున్న అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సందర్భంగా నా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ కి కృతజ్ఞతలు చెప్పుకొంటున్నాను. రామారావుగారు చరిత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలవాలన్న ఆశయంతోనే ‘యన్.టి.ఆర్’ బయోపిక్ ను ప్రారంభించాను. నా తండ్రి పాత్రను పోషించే అద్భుతమైన అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఇక ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కలిగిన నాకోసం ప్రత్యేకంగా రాసిన బ్రాహ్మణుల సన్నివేశాన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు” అన్నారు.

- Advertisement -