జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ అశోక్‌ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రైతుల పక్షాన మాట్లాడినందుకు ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగిపై ఈ విధంగా కక్షసాధింపు చర్యలకు దిగడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. అధికారుల తీరు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. వెంటనే డ్రైవర్ అశోక్‌ను డ్యూటీలోకి తీసుకోని పక్షంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ (RM) కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా జగిత్యాల పట్టణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసి ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం సాగుతున్న సమయంలో అదే మార్గంలో బస్సు నడుపుకుంటూ వెళ్తున్న డ్రైవర్ అశోక్ అక్కడ ఆగి స్పందించారు. ఇక్కడ ఇంధన ధరలపై రాజకీయ ధర్నాలు చేయడం కాదు ముందుగా రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయాలంటూ మంత్రిని నేరుగా కోరారు. ఐలయ్యనగర్ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు సదరు డ్రైవర్‌పై తక్షణమే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఒక ప్రజాప్రతినిధిని నిలదీశారనే కారణంతో జగిత్యాల రీజినల్ మేనేజర్ అశోక్‌కు విధుల నుంచి తొలగిస్తున్నట్లు రిమూవల్ లెటర్ జారీ చేశారు. రేపటి నుంచి డ్యూటీకి రావద్దని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అధికారుల నుంచి వచ్చిన ఈ లేఖతో డ్రైవర్ అశోక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తాను ఏ రాజకీయ పార్టీని లేదా ఏ ఒక్క నాయకుడిని వ్యక్తిగతంగా విమర్శించలేదని కేవలం రైతుల కష్టాలను మాత్రమే ప్రస్తావించానని ఆయన వివరణ ఇచ్చారు. ఒక సామాన్యుడిగా రైతుల బాధలు చూసి తట్టుకోలేక మాట్లాడినందుకు ఉద్యోగం నుంచి తీసేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
ALso Read:టెక్నాలజీ యుగంలో జాప్యమా?

