ప్రాదేశిక పోరులో తగిలిన ఎదురుదెబ్బ నుంచి ఇంకా కొలుకొకుండానే కాంగ్రెస్‌కు వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉత్తమ్ రాజీనామాతో టీఆర్ఎస్‌ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ వీలినానికి శరవేగంగా అడుగులు పడుతుండగా హస్తం పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు.
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం ఖాయం కాగా తాజాగా ఆయనబాటలోనే నడిచేందుకు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్యతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్ గూటికి చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం అయి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
ఇప్పటికే కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పగా తాజాగా మరో ముగ్గురు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నల్గొండ నుంచి ఎంపీగా ఉత్తమ్ కుమార్ గెలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్‌లో మిగిలేది ముగ్గురు,నలుగురేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మొత్తం లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్న ఆనందంలో ఉన్న హస్తం నేతలకు పరిషత్ ఎన్నికలు నిరాశపర్చగా తాజాగా ఎమ్మెల్యేల జంపింగ్‌లతో ఏంచేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు.