అలనాటి మహానటి సావిత్రి గారి బయోపిక్ తో తెలుగు ఇండస్ట్రీలో ఓ బయోపిక్ ల శకం మొదలయ్యిందని చెప్పాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి మనకి తెలిసిందే. ఇప్పుడు ఇండస్ట్రీ లోని ప్రముఖ నటుడైన జగపతి బాబు జీవిత చరిత్ర ఆధారంగా కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న “సముద్రం” లో జగపతి బాబు గారే కధానాయకుడిగా చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం తెలుగు,తమిళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విపరీతమైన డిమాండ్ ఉన్న జగపతి బాబు, ఒకప్పుడు సినిమా అవకాశాల్లేక ఎన్ని కష్టాలు పడ్డారో లెక్కలేదు. మొదట్లో ఆయన నటించిన సినిమాలు అనుకున్నంత విజయాలను రాబట్టకపోగా, ఆయన గొంతు సరిగా లేని కారణంగా వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించేవారు. కొంతకాలం అసలు సినిమాలనే వద్దనుకున్న ఆయన, తర్వాత సినీ రంగంలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అంతఃపురం సినిమాలో ఆయన చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్లు చివరికి ఆయన్ని ఈ స్థాయికి చేర్చాయి. మనకి తెలిసిన పై పొరల్లోనే ఇన్ని విషయాలుంటే, ఆయన అంతరంగంలో పాతుకుపోయిన ఎన్నో జ్ఞాపకాలు కృష్ణవంశీ దర్శకత్వంలో మనముందుకు రాబోతున్నాయ్.
అయితే ఈ బయోపిక్ థియేటర్లోకి రావట్లేదండోయ్. ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ఓ 20 ఎపిసోడ్ లుగా ప్రసారం కానుందని సమాచారం.ఏది ఏమైనా తన పని తాను చేసుకుపోయే జగపతిబాబు జీవితం లోని రహస్యాలను తెలుసుకునేందుకు ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారనే చెప్పాలి.