హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లోనూ నటించి మెప్పించిన ఈ తరం విలక్షణ నటుల్లో ఒకరు జగపతిబాబు. ఈయన నటించిన తాజా చిత్రం ‘రంగస్థలం’ ఈ సినిమాలో ప్రెసిడెంట్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ..అమ్మాయిలకు లైంగిక వేధింపులు కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదని, ఏ రంగంలోనైనా ఇవి జరుగుతూనే ఉంటాయని, అయితే, సినిమా ఫీల్డ్ లో గ్లామర్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా చర్చ జరుగుతోందని నటుడు జగపతిబాబు అభిప్రాయపడ్డారు. ఎవరైనా సరే, సన్నిహితంగా ఉంటేనే అవకాశాలు ఇస్తామని చెబితే, అందుకు అమ్మాయిలు గట్టిగా నిరాకరించాలని పిలుపునిచ్చారు.
తనవరకూ సినీ రంగం సురక్షితమైనదన్న అభిప్రాయమే ఉందని, తన కుమార్తెలు యాక్టింగ్ చేస్తానని చెబితే, అభ్యంతరపెట్టబోనని స్పష్టం చేశారు. తన చిన్న కూతురు చదవలేక చదువుతుంటే, శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా? అని సలహా కూడా ఇచ్చానని అన్నారు. అయితే, తన బిడ్డలకు ఈ రంగంపై ఆసక్తి లేదని జగపతిబాబు చెప్పుకొచ్చారు.