ఐపీఎల్‌లో తెలంగాణ గ్రామీణ క్రికెటర్లను చూడాలనేదే తమ ఆకాంక్ష అని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అన్నారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహిస్తున్న హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్‌ను తన అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్ తదితరులతో కలిసి జగన్‌మోహన్ రావు సందర్శించారు.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి ఆగంరావును జగన్‌మోహన్ రావు అభినందించారు. తన అనుభవంతో, క్రికెట్ పరిజ్ఞానంతో ఇంత మంది పిల్లలకు చక్కటి శిక్షణ ఇప్పిస్తున్నరని ప్రశంసించారు. అనంతరం జగన్‌మోహన్‌రావు తెలంగాణలో క్రికెట్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ మండల స్థాయి నుంచి ప్రతిభావంతులను గుర్తించి వెలికితీస్తామని చెప్పారు. ఇందుకోసమే రూ.1.50 కోట్లు ఖర్చు చేసి, ఎన్నడూ లేని విధంగా సమ్మర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధికి తమ కార్యవర్గ బృందం కట్టుబడి ఉందని, అందులో భాగంగా వేసిన తొలి అడుగు ఈ సమ్మర్ క్యాంప్‌ల నిర్వహణ అని చెప్పారు. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read:KTR:వినోదన్న గెలిస్తేనే కరీంనగర్ అభివృద్ధి