ఎన్నికల ఫలితాలకు టైం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలే కాదు నేతల్లో సైతం టెన్షన్ పీక్ స్ధాయిలోకి చేరిపోయింది. మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. అయితే ఈ నేపథ్యంలో యూపీఏ,ఎన్డీఏ ఏ కూటమి అయినా నేతలు కాదు నెంబర్లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఇందులో భాగంగా విపక్ష కూటమి నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని టీఆర్ఎస్,వైసీపీలకు కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఆహ్వానం పంపారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించడం ఖాయం. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఏపీలో గెలుపుపై వైసీపీ,టీడీపీ ధీమాతో ఉన్నాయి.
ఇక ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో జతకట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు విపక్ష కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా రాహుల్‌తో చర్చించి మెజార్టీ పార్టీలను సమావేశానికి రప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అయితే చంద్రబాబుకు షాకిచ్చేవిధంగా ఈ సమావేశానికి టీఆర్ఎస్,వైసీపీలను ఆహ్వానించింది కాంగ్రెస్.
కేంద్రంలో అధికారంలోకి రావాలంటే నేతలు ముఖ్యం కాదు నంబర్లే(ఎంపీ సీట్లే) ముఖ్యమని స్పష్టమైన సంకేతాలిచ్చింది. దీంతో చంద్రబాబు షాక్‌కు గురయ్యారని సమాచారం. ఎన్నికల రిజల్ట్స్ ఒకవేళ వైసీపీకి అనుకూలంగా వస్తే కాంగ్రెస్…జగన్‌తో కలిసి ముందుకుసాగడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో నెక్ట్స్ స్టెప్ ఏంటా అనే ఆలోచనలో పడ్డారట చంద్రబాబు. మొత్తంగా 2019 సార్వత్రిక ఎన్నికలు చంద్రబాబు భవిష్యత్‌ని డిసైడ్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని పొలిటికల్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.