ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఘంటాపథంగా చెబుతూ వచ్చారు. తీర అధికారంలోకి వచ్చిన తరువాత ఈ హామీ విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్య పరిచిందనే చెప్పాలి. మొదట సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ ఆ తర్వాత దశల వారీగా రద్దు చేస్తామని చెబుతూ వచ్చారు. ఆ తర్వాత మద్యం రేట్లు పెంచి ప్రజలను మద్యానికి దూరం చేస్తామని చెబుతూ వచ్చారు. ఇక రోజులు గడిచే కొద్ది అసలు మద్యపాన నిషేధం హామినే పక్కన పెట్టేశారు..
దీంతో ఇదేంటి అని ప్రశ్నిస్తే మద్యపాన నిషేదం అనే హామీ తమ మేనిఫెస్టోలోనే లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానించడంతో ఏపీ ప్రజలు ఒక్కసారిగా కంగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఈ అంశం హట్ టాపిక్ అవుతోంది. ఇప్పటివరకు 98 శాతం హామీలు అమలు చెబుతున్న వైసీపీ నేతలకు మద్యపాన నిషేదం హామీ కొరకరాని కొయ్యగా మారింది. ఈ హామీ అమలు ఎందుకు కాలేదనే ప్రశకు వైసీపీ నేతలు తెల్లమొఖం వేసుకుంటున్న పరిస్థితి. అయితే దీనిపై మౌనం వహిస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన వైసీపీ నేతలు మద్యపాన నిషేధం ఎందుకు జరగలేదనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంపై స్పందిస్తూ తాము అమలు చేయలేకపోయిన 2 శాతం హామీలలో మద్యపాన నిషేదం ఒకటని, మద్యంపై నిషేదం విధిస్తే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ సరఫరా జరగడం ఖాయమని భావించి ఈ హామీని అమలు చేయలేకపోయినట్లు అంబటి వ్యాఖ్యానించారు. మరోసారి అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం తప్పకుండా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడే హామీ అమలు జరగనప్పుడు.. రెండో సారి అధికారంలోకి వస్తే ఎలా అమలు చేస్తారనే ప్రశ్న ఎదురవుతోంది. మరి ఒకవేళ ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదంపై ఎలాంటి విధానాలను తెరపైకి తెస్తుందో చూడాలి.
Also Read:TTD:శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా అప్‌డేట్