జాతీయ హ్యాండ్ బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన అరిసనపల్లి జగన్ మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం హెచ్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడిగా ఉన్నా జగన్ మోహన్ రావు ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఆదివారం లక్నోలోని బెనారస్ బాబుదాస్ స్టేడియంలో గల హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ప్రస్తుత హెచ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి ఆనందీశ్వర్ పాండే.. తెలంగాణ హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి పవన్.. జగన్‌ను అధ్యక్షుడిగా బలపరస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా ప్రీత్‌పాల్ సింగ్ (మధ్యప్రదేశ్), కోశాధికారిగా వినేశ్ (ఉత్తరప్రదేశ్) ప్రధాన పోటీదారులుగా ఉన్నారు.
ఐపీఎల్ తరహాలో హ్యాండ్‌బాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు జగన్ ఆలోచన చేయడంతో పాటు లీగ్ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకోవడంతో మెజారిటీ రాష్ట్ర సంఘాలు ఆయన వైపే మొగ్గు చూపనున్నట్టు తెలుస్తోంది. హెచ్ఎఫ్ఐలో బలమైన నాయకుడైన ప్రస్తుత అధ్యక్షుడు రామసుబ్రమణ్యం (తమిళనాడు) ఈసారి బరిలోకి దిగే అవకాశాలు లేవపోవడంతో నూతన అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఇక, ఈనెల 21తో నామినేషన్ల పర్వం పూర్తవుతుంది. 22న నామినేషన్ల స్క్రూట్ని, 24న నామినేషన్ల ఉపసంహరణ, 26న పోటీలో ఉన్న అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటించనున్నారు. వచ్చే నవంబరు 1న ఎన్నికల నిర్వహణ, ఫలితాలు ప్రకటన, నూతన అధ్యక్షుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగనుంది.