రసవత్తరంగా, నాటకీయంగా జరుగుతుందని భావించిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఎలాంటి హంగామా, హడావిడి లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు అధ్యక్షతన జరిగిన 86వ ఏజీఎంలో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, శివ్‌లాల్ యాదవ్, అర్షద్ ఆయూబ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులు జి.వినోద్, అనిల్, సీనియర్ సభ్యులు జాన్ మనోజ్, వి.హనుమంత్‌రావు, చాముండేశ్వర్‌నాథ్, శేష్‌నారాయణ్, అమర్‌నాథ్, వంకా ప్రతాప్, ఆగంరావు తదితరులు ఏజీఎంలో తమ అమూల్యమైన సూచనలు, సలహాలను కొత్త పాలకవర్గానికి అందించారు. ప్రత్యర్థి వర్గమనేదే లేకుండా హెచ్‌సీఏ సభ్యులందరిని ఒకతాటిపైకి తీసుకొచ్చి, ఏజీఎంను ఫలప్రదంగా ముగించడంలో జగన్‌మోహన్ రావు తన మార్క్‌ను చూపించారు. దిగ్గజాలు, సీనియర్లు, ఎన్నికల్లో తలపడిన అన్ని వర్గాలనూ జగన్‌మోహన్ రావు చాకచక్యంగా సమన్వయం చేసుకుంటూ సమావేశాన్ని ముందుకు నడిపించారు. ఏజీఎంను విజయవంతంగా నిర్వహించడంలో ప్రధాన కార్యదర్శి దేవ్‌రాజ్ సహా కార్యవర్గ సభ్యులంతా కలిసికట్టుగా పనిచేశారు.
ఏజీఎంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
హైదరాబాద్‌తో సమాంతరంగా జిల్లాల్లోనూ క్రికెట్ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు డిస్ట్రిక్ క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మడి, పాత జిల్లాల్లో డిస్ట్రిక్‌కు ఒక మినీ స్టేడియం నిర్మించాలని తీర్మానించారు. ఉప్పల్ స్టేడియంలో 250 మందితో బోర్డింగ్ సదుపాయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ ఎక్స్‌లెన్స్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో 100 మందితో మహిళలకు ప్రత్యేక అకాడమీ. అలానే జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు శాటిలైట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. మహిళా క్రికెటర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కమిటీని నెలకొల్పారు. ఇక, రూ.100 కోట్ల వ్యయంతో హైదరాబాద్ పరిసరాల్లో ఒక అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలనే ఒక ప్రతిపాదనను కూడా ఏజీఎంలో చేశారు. బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రావాల్సిన పెండింగ్ నిధులను సత్వరం విడుదల చేయించేందుకు అపెక్స్ కౌన్సిల్ కృషి చేయాలని తీర్మానించారు. త్వరలో కొత్త జిల్లాల క్రికెట్ సంఘాలకు గుర్తింపును ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభించాలని నిర్ణయించారు.
జగన్‌మోహన్‌ను ప్రతిపాదించిన అమర్నాథ్
బీసీసీఐ సమావేశాలకు హెచ్‌సీఏ ప్రతినిథిగా ఎవరిని పంపించాలనే విషయంలో జరిగిన చర్చలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కొద్ది నెలలు కిందట అధ్యక్ష ఎన్నికల్లో జగన్‌మోహన్ రావుతో హోరాహోరీగా పోటీపడి ఒక్క ఓటు తేడాతో ఓడిన అమర్నాథ్‌నే హెచ్‌సీఏ ప్రతినిథిగా జగన్‌మోహన్ రావు పేరును ప్రతిపాదించడం విశేషం. దీంతో ఒకసారిగా సమావేశంలో వాతావరణమంతా మారిపోయింది. మొత్తానికి సభ్యులందరి ఆమోదంతో అధ్యక్ష, కార్యదర్శులు ఇరువురు రోటేషన్ పద్ధతితో బీసీసీఐ సమావేశాలకు హాజరయ్యేందుకు అంగీకరించారు.ఈ సమావేశానికి ఐసీఏ నుంచి, ఆర్ఏ స్వరూప్, వంకా రోమా సింగ్, హెచ్‌సీఏ క్లబ్ సెక్రటరీలు, జిల్లా క్రికెట్ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:విజయం ఆ పార్టీదే : ఉండవల్లి!