పొంగులేటి అక్రమ మైనింగ్‌పై చర్యలేవి?

9
- Advertisement -

అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభా సాక్షిగా ప్రభుత్వం బహిరంగంగా దొరికిపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా అక్రమ మైనింగ్ వ్యవహారంలో మంత్రి పొంగులేటి పాత్రపై సందేహాలు వ్యక్తం చేశారు.

జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..హరీష్ రావు అక్రమ మైనింగ్‌పై ట్వీట్ చేస్తే, దానికి స్పందనగా మంత్రి పొంగులేటి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం జరుగుతుందని హరీష్ రావు సభ దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై సరైన సమాధానం ఇవ్వాల్సిన మంత్రి, ఇతర మంత్రులతో కలిసి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారని విమర్శించారు.

అక్రమంగా నడుస్తున్న క్రషర్ యూనిట్‌పై కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అనుమతులు లేకుండా డీజిల్ జనరేటర్లతో క్రషర్ నడుస్తోందని, దీనిపై అధికారులు నోటీసులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. చిన్న ఉద్యోగులు లంచం తీసుకుంటే ఏసీబీ కేసులు పెడుతున్న ప్రభుత్వం, పెద్దస్థాయి అక్రమాలపై మౌనం వహిస్తోందని మండిపడ్డారు.

పొంగులేటి కుటుంబ సభ్యులే క్రషర్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ…వారి భార్య, తమ్ముడు, కుమారుడు దూరపు బంధువులా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, సభా సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పై కూడా జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబ సభ్యులపై కేసులు పెడతామని బెదిరించడం ద్వారా అసెంబ్లీ స్థాయిని దిగజార్చారని అన్నారు. “ప్రజల దృష్టిలో మీరు దొంగలుగా నిలిచిపోయారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read:యూపీ అభివృద్ధికి ‘రన్‌వే’గా జేవర్ ఎయిర్‌పోర్ట్!

ఇసుక ధరల విషయమై కూడా ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి. తమ ప్రభుత్వం సమయంలో టన్ను రూ.876 ఉండేదని, ఇప్పుడు రూ.1600కి పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కాళేశ్వరం, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వద్ద ఇసుక మాఫియా కొనసాగుతోందని ఆరోపించారు.

మెట్రో అంశంపై తీసుకొచ్చిన తీర్మానం ఏకగ్రీవం కాదని, అది ఏకపక్ష నిర్ణయం అని పేర్కొన్నారు. అలాగే కేటీఆర్‌పై కేసులు పెట్టినా, ఆయన ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు.

- Advertisement -