ఇంటర్ ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేయడం తగదని మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన విద్యార్థులను, తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు రాజకీయాలు చేయొద్దన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని స్పష్టం చేశారు.
ఫలితాలపై అనుమానాలున్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు జగదీష్ రెడ్డి. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని అందరికి న్యాయం జరుగుతుందన్నారు. పరీక్ష మళ్లీ రాయొచ్చు.. ప్రాణం పోతే మళ్లీ రాదు.. విద్యార్థులను తల్లిదండ్రులు గమనించాలని సూచించారు.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువ ఉన్నాయన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సూచించిన జగదీశ్ రెడ్డి… ఫలితాలపై విచారణ కొనసాగుతోందని నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. సాంకేతిక సమస్య ఉంటే సంస్థపైన … మానవ తప్పిదంగా తేలితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.