నగరంలో ఈరోజు నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ నగరానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంక ట్రంప్ నేటి నగర పర్యటన ఖరారయింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు చేరుకున్న ఇవాంక అక్కడి నుంచి మాదాపూర్ లోని ట్రైడెంట్ హోటల్ కు ఇవాంక చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హెచ్‌ఐసీసీకి ఇవాంక చేరుకోనున్నారు. ముందుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఇవాంక భేటీ కానున్నారు. అనంతరం ప్రధాని మోదీతో ఇవాంక భేటీ అవుతారు.
సాయంత్రం 4.25 గంటలకు జీఈ సదస్సులో ఇవాంక పాల్గొననున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదార్లతో ఇవాంక మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు ట్రైడెంట్ హోటల్ కు ఇవాంక చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ఇవాంక ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. ప్యాలెస్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే విందులో ఆమె పాల్గొంటారు. రాత్రి 10 గంటలకు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి ఇవాంక బయలుదేరి హోటల్‌కు వెళ్తారు.
ఈనెల 29న ఉదయం 10 గంటలకు మళ్లీ హెచ్ఐసీసీకి ఇవాంక చేరుకుంటారు. సదస్సు రెండో రోజు పలు ప్లీనరీల్లో ఆమె పాల్గొంటారు. పలువురు ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇవాంక తిరుగు ప్రయాణం అవనున్నారు.