ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 28న నగరంలో జరిగే సదస్సులో పాల్గొననుంది. ఈ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేసింది. తాజ్ ఫలక్‌నుమా పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, యూఎస్ సెక్యూరిటీ సర్వీసెస్, ఆక్టోపస్ కమాండోస్, గ్రేహౌండ్ సిబ్బంది.. నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
హైదరాబాద్ టూర్‌లో భాగంగా ఇవాంక ఓల్డ్ సిటీలో పర్యటించే అవకాశం ఉంది. ఓల్డ్ సిటీలోని లాడ్‌బజార్‌లోనూ షాపింగ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. బ్యాంగిల్స్, బ్రైడల్ వియర్‌కు ఫేమస్ అయిన లాడ్‌బజార్‌లో ఆమె షాపింగ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇవాంక షెడ్యూల్ పూర్తిగా వెల్లడికాలేదు. చార్మినార్ దగ్గరే ఉన్న మక్కా మసీదుతో పాటు చౌమహల్లా ప్యాలెస్‌లను కూడా ఇవాంకా విజిట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రతిబింబించే గాజులకు నెలవైన హైదరాబాద్ లాడ్‌బజార్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇవాంక మనస్సు దోచుకొనే రకరకాల డిజైన్ గాజులతో దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఒక్క గాజులే కాకుండా వెరైటీ వస్త్రాలు, ఆభరణాలు, శతాబ్దాలుగా మగువల మదిని దోచుకుంటున్న డిజైన్‌లు ఇవాంకా కోసం పాతబస్తీలో ప్రదర్శనకు ఉంచారు.