త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని మరోసారి స్పష్టం చేస్తున్నాయి సర్వేలు. ఇప్పటికే పలు సర్వేలు తెలంగాణలో టీఆర్ఎస్‌కు తిరుగులేదని వెల్లడించగా తాజాగా సీ-ఓటర్,టైమ్స్ నౌ,ఐటీటెక్ గ్రూప్ సంస్థలు నిర్వహించిన సర్వేలో కేసీఆర్ సర్కార్‌కు తిరుగులేదని చెప్పాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్ లో మాత్రమే బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.
తెలంగాణలో 119 స్ధానాల్లో టీఆర్ఎస్‌కు 85,కాంగ్రెస్‌కు 18,ఎంఐఎం 7,బీజేపీ 5 ఇతరులు 4 సీట్లలో గెలుస్తారని అంచనా వేసింది. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లకు గాను 47 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది.
మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా బీజేపీకి 126, కాంగ్రెస్ కు 97, ఇతరులకు 7 సీట్లు దక్కే చాన్స్ ఉందని తెలిపింది. రాజస్థాన్‌లో 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కాంగ్రెస్‌కు 129, బీజేపీకి 63, ఇతరులకు 8 సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. మొత్తంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్న ఈ ఎన్నికలు కాంగ్రెస్,బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.