ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ల ధారాదత్తం..

31
dayakarrao

కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసి, కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌ల‌కు ధారాద‌త్తం చేసేందుకు కేంద్రంలోని బిజేపి ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తుంద‌ని అందులో భాగంగానే రైతుల‌కు వ్య‌తిరేకంగా తీసుకొచ్చింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిసర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. శుక్ర‌వారం హ‌నుమ‌కొండ‌లో చీఫ్ విప్ విన‌య్‌భాస్క‌ర్‌, ఎమ్పీ ప‌సునూరి ద‌యాక‌ర్‌, ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్‌, మేయ‌ర్ గుండు సుధారాణిల‌తో క‌లిసి ఏర్పాటు చేసిన‌ విలేక‌రుల స‌మావేశంలో మంత్రి మాట్లాడారు. రైతులు, రైతుల‌కు మ‌ద్ద‌తుగా కొన్ని రాజ‌కీయ‌పార్టీలు చేస్తున్న ఆందోళ‌న‌ల‌తో దిగివ‌చ్చిన కేంద్ర ప్ర‌భుత్వం నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌ధాని ప్ర‌క‌టించి, క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. నూత‌న‌ వ్యవసాయ చట్టాల ఉపసంహరణ దేశంలోని ప్రతి ఒక్క రైతు గెలుపుతోపాటు టిఆర్ఎస్ విజయమ‌ని అన్నారు.

కేంద్రం ఆలస్యంగానైనా నిర్ణయం తీసుకున్నందుకు సంతోషిస్తూనే.. 15 నెలలుగా చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, పోలీసుల లాఠీ దెబ్బలు తింటూ, బాష్పవాయువు గోళాలను భరిస్తూ , ఆకలికి అలమటించి, అమరులైన రైతుల వీరోచిత పోరాటానికి తెలంగాణ రైతాంగం తరపున తలవంచి నమస్కరిస్తూ.. అసువులు బాసిన రైతాంగానికి నివాళులు అర్పిస్తున్నాం. నల్లచట్టాల గురించి రైతులకు కూలంకషంగా అర్దమయిందని భావించే కేంద్రం వెనక్కు తగ్గిందని.. గత కొన్నాళ్లుగా తెలంగాణ ధాన్యం కొనుగోలు కోసం జరుగుతున్న పరిణామాలు , కేసీఆర్ స్వయంగా ఢిల్లీ వెళ్లడం, లేఖలు, వాదోపవాదాలు, తెలంగాణ బీజేపీ అసంబద్ధ వైఖరి వెరసి తెలంగాణ ప్రభుత్వం ఆందోళన పథం పట్టే అగత్యం కలిగిందన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో చేప‌ట్టిన మ‌హాధర్నా దేశంలోనే పెద్ద మలుపు అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన, పరిపాలన ప్రజ్ఞ, దక్షత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మోడీకి తెలుసు. అందుకే మోదీ దిగి వచ్చారని, టిఆర్ఎస్ ఆందోళనతో కేంద్రంలో చలనానికి ఒక కారణమైంద‌న్నారు. అన్ని భాషల మీద పట్టున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోడీ ప్రభుత్వానికి తెలుసన్నారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని అయిన మోడీ తమ ప్రభుత్వం వల్ల జరిగిన తప్పిదానికి హుందాగా క్షమాపణ చెప్పడం అభినందనీయం. మోడీకి ఉన్న సంస్కారం, హుందాతనంలో కొంచెమైనా తెలంగాణ బీజేపీ నేతలకు ఉంటే బాగుండేది. కేంద్రం తెచ్చిన నూత‌న చ‌ట్టాల వ‌ల్ల రైతాంగానికి భ‌విష్య‌త్‌లో క‌ష్టాలు వ‌స్తాయ‌ని గుర్తించి టిఆర్ఎస్ పార్టీ, ముఖ్య‌మంత్రి కేసిఆర్ వ్య‌తిరేకిస్తుంటే.. రాష్ట్రంలోని స్థానిక బిజేపి నాయ‌కులు కేంద్రం తెచ్చ‌న చ‌ట్టాల‌తో రైతుల‌కు లాభం జ‌రుగుతుంద‌ని మొండి వాద‌న‌లు చేశార‌ని, ఇప్పుడు ఏం స‌మాధానం చేబుతార‌ని అన్నారు. క‌రోనా స‌మ‌యంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌హీన‌ప‌డితే.. అంబానీ, అధానీల సంప‌ద పెరుగ‌డానికి గ‌ల కార‌ణాల‌ను బిజేపి నాయ‌కులు దేశ‌ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణలో పండించిన‌ వరిని కేంద్రం కొనుగోలు చేయాలని .. ప్ర‌తి గింజ‌ను కొనుగోలు చేస్తామ‌ని హామీనిస్తూ.. లేఖ తీసుకురావాల్సిన భాద్య‌త ఈ రాష్ట్ర బిజేపి నాయ‌కుల‌పై ఉంద‌న్నారు. ధాన్యం సేక‌ర‌ణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గ‌ద‌ని.. తెలంగాణలో పండించిన వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేసేవ‌ర‌కు కేంద్రంపై స‌మ‌రానికి వెనుకాడ‌ద‌ని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయాన్ని అభివృద్ది చేస్తూ, రైతాంగానికి అండ‌గా ముఖ్య‌మంత్రి కేసిఆర్ నిలిచార‌ని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన న‌ల్ల చ‌ట్టాల‌ను మొద‌టి నుంచి వ్య‌తిరేకిస్తున్న‌ సియం కేసిఆర్ ఆదేశాల‌తో పార్ల‌మెంట్‌లో న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా టిఆర్ఎస్ పార్టీ ఎమ్పీలు బైకాట్ చేశార‌ని అన్నారు. నూత‌న సాగు చ‌ట్టాల‌కు వ్యతిరేకంగా సియం కేసిఆర్ రైతుల ప‌క్షాన నిల‌బ‌డేందుకు దేశ‌వ్యాప్తంగా రైతుల‌ను ఏకం చేసేందుకు శ్రీ‌కారం చుట్టి ధ‌ర్నాలు చేప‌ట్ట‌డంతో కేంద్రంలోని బిజేపి ప్ర‌భుత్వం దిగివ‌చ్చింద‌న్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగాన్ని అభివృద్ది చేస్తూ.. రైతుల కోసం రైతుబంధు, రైతు భీమా, సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్మించి రైతుల‌కు అండ‌గా ఉన్నార‌ని అన్నారు. నూత‌న చ‌ట్టాల‌ను అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌పై ఒత్తిడి తెచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేయ‌డానికి మ‌న ముఖ్య‌మంత్రి కేంద్రం నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి రైతాంగానికి అండ‌గా నిలిచారని అన్నారు. ఇప్ప‌టికైనా బిజేపి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బుద్ది తెచ్చుకోని రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను వ‌దిలి తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వ‌ర‌కు టిఆర్ఎస్ ప్ర‌భుత్వం చేస్తున్న పోరాటంలో క‌లిసి రావాల‌ని సూచించారు. రాబోయే రోజుల్లో దేశంలోని ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకునేందుకు మ‌న ముఖ్య‌మంత్రి కేసిఆర్ నాయ‌క‌త్వం వ‌హిస్తార‌ని అన్నారు.