సంక్రాంతికి బాలయ్య-చిరు మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. చాలా కాలం గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150తో చిరంజీవి రీఎంట్రి ఇవ్వగా బాలయ్య సైతం తన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణితో ముందుకొచ్చాడు. తాజాగా ఈ దసరాకు మరో సంగ్రామానికి రంగం సిద్దమైంది. బాలయ్య-ఎన్టీఆర్-మహేష్ మూవీలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉండటంతో ఎవరిది పైచేయి అవుతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘పైసా వసూల్’ సినిమా సెప్టెంబర్ 29న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సరిగ్గా వారం ముందు… అంటే సెప్టెంబర్ 21న జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని తారక్ అన్న కల్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు ఒకే సమయంలో విడుదల కానుండటం చర్చనీయాంశం అయింది.
విడుదల విషయంలో ఎవరైనా రాజీ పడతారా అనే ప్రశ్న తెలెత్తింది. దీంతో, అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపడం ఇష్టంలేక తారక్, కల్యాణ్ రామ్ లే రాజీపడ్డారని సమాచారం. బాబాయ్ సినిమా కోసం తమ సినిమా విడుదలను వాయిదా వేయాలని తారక్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బాబాయ్ తో పోటీపడటం కల్యాణ్ రామ్ కు కూడా ఇష్టం లేదట.
అయితే,సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం స్పైడర్‌ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ విడుదల విషయంలోనూ అభిమానుల సహనాన్ని పరీక్షించింది ‘స్పైడర్’. చివరకు సినిమా విడుదల విషయంలోనూ అదే జరిగింది. జూన్ 23న వస్తుందనుకున్న సినిమా భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వెనక్కి వెళ్లింది. దీంతో ఈసారి కచ్చితంగా సెప్టెంబర్ 27న సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టి నిర్ణయానికొచ్చినట్టు ఓ టాక్ వినిపిస్తోంది.
బాలయ్య కోసం అబ్బాయి ఎన్టీఆర్ తప్పుకున్న మహేష్ మాత్రం తన సినిమా విడుదల తేదీని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నాడట.దసరా సీజన్‌ని టార్గెట్ చేసుకుని వెంటవెంటనే విడుదల కానున్న ఈ రెండు సినిమాల మధ్య సమీప పోటీ తప్పేలా లేదని అంటున్నాయి ఇండస్ట్రీవర్గాలు.