ఇటలీ జట్టు… నేపాల్‌పై టీ20 వరల్డ్ కప్‌లో తమ తొలి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఆ చారిత్రాత్మక విజయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీతో కలిసి సంబరంగా జరుపుకుంది. ఫిబ్రవరి 12న ముంబైలోని వాంఖెడే స్టేడియం చారిత్రక ఘట్టానికి వేదికైంది. నేపాల్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన ఇటలీ, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 124 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13 ఓవర్లలోపు చేధించి సంబరాలు మొదలుపెట్టింది. ఇటాలియన్ క్రికెట్ అధ్యక్షుడు సిమోనే గాంబినో ఈ విజయంలో భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉన్నవారు ప్రముఖ బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ.
కబీర్ బేడీ 1976లో ప్రసారమైన ఇటాలియన్ మినీ సిరీస్ ‘సాండోకాన్’లో నటించి ఇటలీలో ఎంతో ప్రాచుర్యం పొందారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడే ఓ తిరుగుబాటు దొంగ పాత్రలో నటించిన ఆయనను ఇటలీలో “మలేషియన్ టైగర్” అని పిలుస్తారని గాంబినో పేర్కొన్నారు. “ఇటలీలో మీరే అందరికీ తెలుసు. మలేషియన్ టైగర్ కబీర్ బేడీ,” అని ఆయన అన్నారు.
ఇటాలియన్ క్రికెట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కబీర్ బేడీ గాంబినోకు అభినందనలు తెలిపిన వీడియోను పోస్ట్ చేశారు. బేడీ జట్టుతో ఇటాలియన్ భాషలో మాట్లాడారు. దశాబ్దాల క్రితం ఇటలీని క్రికెట్ పటంలో నిలపాలన్న గాంబినో కల ఈ విజయంతో సాకారమైందని బేడీ గుర్తుచేశారు.
ఆనందోత్సాహంలో గాంబినో ఇంగ్లాండ్ జట్టుకు హెచ్చరిక కూడా జారీ చేశారు. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలని, సెమీఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. 10 వికెట్ల విజయం వల్ల మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా ఇటలీ గ్రూప్-సి పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్‌ను దాటి మూడో స్థానానికి చేరింది. ఈ క్షణాన్ని నేను ఊహించలేదు. కానీ ఇప్పుడు కోల్‌కతాకు వెళ్లి ఇంగ్లాండ్‌ను ఓడించాలనుకుంటున్నాం. మేము సెమీస్‌లో ఉండాలి అని గాంబినో వీడియోలో అన్నారు.
Also Read:గడ్డ పొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచిన ఇటలీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. క్రిషన్ కలుగమాగే నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసి నేపాల్‌ను 123 పరుగులకు పరిమితం చేశాడు. బెన్ మనెంటీ కూడా నాలుగు ఓవర్లలో కేవలం తొమ్మిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు.చేదనలో జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా జోడీ అజేయంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కేవలం 12.4 ఓవర్లలో నెలకొల్పి వాంఖెడే స్టేడియంలో ఇటలీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారు.

