టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో నటుడు రానా కీలక వ్యాఖ్యలు చేశాడు. తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ తమిళ వెర్షన్ ఆడియో వేడుక కోసం చెన్నై వెళ్లిన రానా.. ఓ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. నిజం చెప్పాలంటే నటులు, దర్శకులు డ్రగ్స్ తీసుకుంటున్నందుకు తనకు బాధగా లేదని, ఎందుకంటే వారు పెద్దవారని, అది వారి జీవితమని పేర్కొన్నాడు. వారు ఎలా కావాలంటే అలా నడుచుకోవచ్చని స్పష్టం చేశాడు.
టాలీవుడ్ సెలబ్రెటీలు ఎవరైనా డ్రగ్స్ తీసుకోవడం వల్ల చచ్చినా ఐ డోంట్ కేర్. అయితే వీటి బారిని చిన్నారులు పడడమే తనను తీవ్రంగా బాధిస్తోందన్నాడు. స్కూలు పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి తాను చాలా కలత చెందానన్నాడు. డ్రగ్స్‌కు అలవాటు పడిన పిల్లల పేర్లు కూడా బయటపెట్టాలని కొందరు అంటున్నారు. అది తప్పు. పిల్లలు డ్రగ్స్ వాడటం అనేది చాలా సున్నితమైన సమస్య. దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి’ అని చెప్పారు. డ్రగ్స్ వాడటం తప్పు, చట్ట విరుద్ధమనే విషయాన్ని పిల్లలకు తెలిసేలా చూడాలన్నారు.
ఈ విషయమై తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు. అసలు పిల్లలకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు? డ్రగ్స్ తెస్తున్నవారు విదేశీయులా? వారు దేశంలోకి డ్రగ్స్‌ను ఎలా తీసుకురాగలుగుతున్నారు? అని రానా ప్రశ్నించాడు. కాగా, రానా నటించిన ‘నేనే రాజు-నేనే మంత్రి’ సినిమా విడుదలకు సిద్ధమైంది.