ఓట్లు పడేనాటికి ఇంటింటికి నల్లా నీళ్లు- కేటీఆర్

305
KTR
- Advertisement -

ఎన్నికల వేళ మహాకూటమి నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ లో టీఆర్ఎస్ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఘన్‌పూర్‌కు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉందని.. స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ పార్టీకి బలమైన నాయకులను అందించిందన్నారు. రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని.. రాజకీయాలకు అతీతంగా పని చేసి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఎమ్మెల్యేలందరికి నిధులు కేటాయించామని.. ప్రాజెక్టులపై కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా పలు చోట్ల ఇంటింటికి మంచినీళ్లు అందుతున్నాయని.. ఓట్లు పడేనాటికి ఇంటింటికి నల్లా నీళ్ల కార్యక్రమం పూర్తవుతుందన్నారు. టీఆర్ఎస్ హయంలో భిన్నమైన పథకాలు అమల్లోకి వచ్చాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతయ్యేలా టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. విత్తనాలను పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన దుస్థితి కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రైతుబంధు పథకం అమలు చేస్తున్నామని.. చనిపోయిన వాళ్ల మీద కేసులు వేయడం దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. ఓటమితప్పదనే కుంటిసాకులు చెప్తున్నారని.. ప్రాజెక్టులపై కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్, టీడీపీ నేతలకు ప్రజలే బుద్ది చెప్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

- Advertisement -