తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఐటీ యూనిట్లనను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన సుమారు 18 కంపెనీల అంగీకార పత్రాలను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ ఈరోజు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావుకు బేగంపేట క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో పాటు… తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ఐటి అనుబంధ పాలసీల ద్వారా ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరిస్తుందని, ఇందుకు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా కేంద్రాలతోతోపాటు ప్రస్తుతం మహబూబ్ నగర్ లోనూ కంపెనీల స్ధాపనకు వచ్చిన ఆసక్తి వ్యక్తీకరణే నిదర్శనమన్నారు. త్వరలోనే మహబూబ్ నగర్ ఐటి టవర్ కు సంబంధించిన పరిపాలన పరమైన అనుమతులను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని మంత్రి,ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆసక్తి వ్యక్తపరచిన 18 కంపెనీలతోపాటు మరిన్ని కంపెనీలను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి రప్పించేందుకు తెలంగాణ ఎన్నారైలతో సహకారం తీసుకోవాలన్నారు.
నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధతో ఆయా పట్టణాలలో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు ఎన్నారైలతో సమావేశం అయిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే ఐటీ శాఖ సహకారంతో మహబూబ్ నగర్ కు మరిన్ని కంపెనీలను రప్పించేందుకు అమెరికాకు వెళతామని మంత్రికి ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీని జిల్లాలకు విస్తరించడం ద్వారా ముఖ్యంగా మహబూబ్ నగర్ లాంటి వెనుకబడిన జిల్లాకు ఎంతో మేలు చేకూరుతుందని, స్థానికంగా విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.