భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్కో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి యుకేకు చెందిన రెండు ఉపగ్రహాలు నోవాసర్, ఎస్1-4ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఆదివారం రాత్రి 10.08 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి42ని లాంచ్ చేసింది.
ఈ రాకెట్ 17.45 నిమిషాలకు 583 కి.మీ. ఎత్తుకు చేరుకుంది. భూమధ్యరేఖకు 97.80 డిగ్రీల వాలులో 140 డిగ్రీల దిగాంశంపై సూర్య సమస్థితి కక్ష్యలో 483 కిలోల నోవాసర్ ఎస్, 444 కిలోల ఎస్1-4 ఉపగ్రహాలను విడిచింది. ఇప్పటి వరకు 243 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీని పంపడం 33వసారి.
వనరుల అధ్యయనం- వినియోగం, పరిసరాల పరిశీలన, పట్టణ నిర్వహణ సంబంధిత అంశాలను పరిశీలించేందుకు ఎస్1-4 ఉపగ్రహం నిర్మాణం సాగింది. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగాలు పగటిపూట నిర్వహిస్తారు. అయితే వాటికి భిన్నంగా ప్రస్తుత ప్రయోగం రాత్రిపూట నిర్వహించడం విశేషం. పీస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇస్రో అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.