గత ఫిబ్రవరిలో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా మరో ఘనతను సాధించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ40 రాకెట్ ద్వారా మూడు స్వదేశీతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి విజయవంతంగా ఉదయం 9.29 గంటలకు నింగిలోకి పంపించింది.
పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు దూసుకెళ్లింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్-2ఇ, ఒక నానో శాటిలైట్, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లవుతుంది.
గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించి అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్ చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్ బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది.