పెద్ద మొత్తం డబ్బుతో పాటు అదనంగా నమ్మకాన్ని కూడా పెట్టుబడిగా పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూషన్. లాభాలు వస్తే వచ్చినట్టు. ఆ సదరు సినిమా ప్రేక్షకుడికి నచ్చకపోతే మన చేతులు కాలినట్టు. అందుకే ఈ వ్యాపారంలో నమ్మకానికి, అదృష్టం తోడు కావాలని అంటారు. ఈ మధ్య కాలంలో డిస్ట్రిబ్యూటర్‌గా అలా నమ్మకాన్ని, అదృష్టాన్ని తనవెంట పెట్టుకుని `ఇస్మార్ట్`గా ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్నటిదాకా ఆయన కార్తికేయ ఎగ్జిబిటర్స్ శ్రీను…. ఇప్పుడు `ఇస్మార్ట్ శంకర్`తో డిస్ట్రిబ్యూటర్‌గా హ్యాట్రిక్ హిట్ సాధించి `ఇస్మార్ట్` శ్రీనుగా అభినందనలు పొందుతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాతలుగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ తెలంగాణ యాసలో అదరగొట్టిన `ఇస్మార్ట్ శంకర్` ఆయనకు డిస్ట్రిబ్యూటర్‌గా హ్యాట్రిక్ చిత్రమన్నమాట.
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు చూపిస్తున్న ఈ చిత్రం గురించి, తన గురించి డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతూ “మా కార్తికేయ ఎగ్జిబిటర్స్ సంస్థ తరఫున నైజామ్‌లో మొదట `కబాలీ` చేశాను. రజనీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమా చాలా మంచి కలెక్షన్లు తెచ్చింది. ఆ తర్వాత `హుషారు` డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ సబ్జెక్ట్ తో `హుషారు` కుర్రకారును థియేటర్లలో కూర్చోబెట్టింది `ఉండిపోరాదే….` అంటూ సక్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. సక్సెస్‌ఫుల్‌గా ద్వితీయ విఘ్నం దాటేశానని మిత్రులందరూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని ఆ క్షణాల్లోనే బలంగా కోరుకున్నా. అందుకే తొందరపడకుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి జగన్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేషన్‌లో `ఇస్మార్ట్ శంకర్` రూపొందుతున్నప్పటి నుంచే నాకు క్రేజీగా అనిపించింది.
రామ్ తెలంగాణ యాటిట్యూట్ కొత్తగా అనిపించింది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని పూరిగారిని, ఛార్మిగారిని కలిసి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నా. నేను అనుకున్నట్టుగానే బాక్సాఫీస్ ను `ఇస్మార్ట్ శంకర్` షేక్ చేస్తోంది. థియేటర్లలో సినిమాను చూసి బయటకొస్తున్న ఫ్యాన్స్ `పూరిగారి `పోకిరి` చిత్రం గుర్తుకొస్తోంది` అని అంటున్నారు. `పోకిరి` రోజులంటే కలెక్షన్ల సునామీ అన్నమాటే. `ఇస్మార్ట్ శంకర్` నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్దరూ `ఇక నిన్ను అందరూ `ఇస్మార్ట్` శ్రీను అంటారు. అదే పేరుతో పాపులర్ అవుతావు` అని అన్నారు. వారి మాటలు చాలా ఆనందం కలిగించాయి.
`ఆర్.ఎక్స్.100` కార్తికేయ హీరోగా నటించిన `గుణ 369` ఆంధ్రప్రదేశ్ హక్కులు తీసుకున్నా. అదొక యథార్థగాథతో తెరకెక్కించిన చిత్రం. మానవ విలువల్ని టచ్ చేసే కమర్షియల్ సినిమా. ఇప్పటిదాకా చేసిన `కబాలి`, `హుషారు`, `ఇస్మార్ట్ శంకర్`….ఈ మూడు సినిమాల విషయంలో నా అంచనాలు తప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజయపరంపరను `గుణ 369` కొనసాగిస్తుందని నా నమ్మకం. భవిష్యత్తులోనూ మంచి మంచి సినిమాలను పంపిణీ చేసి, మా సంస్థ పేరును `ఇస్మార్ట్`గా నిలబెట్టుకోవాలని అనుకుంటున్నా“ అని చెప్పారు.