ఇజంతో మరోమారు పేలిన పటాస్

266
- Advertisement -

డాషింగ్ డైరెక్షర్ పూరి జగన్నాథ్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘ఇజం’. పటాస్ విజయంతో మంచి ఊపు మీదున్న కళ్యాణ్ రామ్‌..ఇజంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ లుక్స్, టీజర్ బాగుండటం, కళ్యాణ్ రామ్ పాత లుక్ ను మార్చి కొత్తగా కనిపిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరి సైతం ఇజం కళ్యాణ్ రామ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోతుందని చెప్పడంతో పాటు.. ఈ చిత్రంలో సోషల్ మెసేజ్ ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన ఇజం కళ్యాణ్‌రామ్‌కు సూపర్‌ హిట్ ఇచ్చిందా.. పూరి ఇజంలో ఏముంది..? ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా చూద్దాం…

కథః

కళ్యాణ్ రామ్ (కళ్యాణ్ రామ్) ఓ స్ట్రీట్ ఫైటర్‌. బ్యాంకాక్‌లోని ఓ దీవిలో డబ్బుల కోసం ఫైట్ చేస్తుంటాడు. కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం కోసం అన్వేషిస్తుంటాడు. ఈ క్రమంలో చీకటి సామ్రాజ్యానికి అధినేత అయిన జావేద్ భాయ్‌(జగపతిబాబు) కూతురు అలియా(అదితి ఆర్య)ని ప్రేమిస్తాడు. సత్యలో తను కోరుకున్న లక్షణాలు ఉండటంతో అతన్ని ప్రేమిస్తుంది.అయితే తాను ప్రేమించిన కళ్యాణ్ అసలు పేరు సత్య మార్తాండ్ అని…తన తండ్రి భాగోతాన్ని బయటపెట్టడానికి వచ్చిన జర్నలిస్ట్ అని తెలుస్తుంది. అసలు సత్య మార్తాండ్ ఎంవరు..? జావేద్ భాయ్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు..? విదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న నల్ల డబ్బుని ఎలా కొల్లగొట్టాడు ? అన్నదే ఇజం కథ.

ప్లస్ పాయింట్స్ :

పూరి జగన్నాథ్‌ గొప్ప కథకుడు. చిన్న పాయింట్‌ అయినా ఆసక్తికరమైన కథగా మలచి ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కూర్చోబెట్టే సమర్థుడు.అలాంటి చిన్న కథకే కమర్షియల్ హంగులు అద్ది అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కళ్యాణ్ రామ్. గత సినిమాల్లో కన్నా కాన్ఫిడెంట్‌గా డైలాగ్ డెలివరీ, మ్యానరిజం, ఎమోషనల్ సన్నివేశంలో అద్భుతమైన నటనను కనబర్చాడు.

జగపతి బాబుకి, కళ్యాణ్ రామ్ కి మధ్య బీడీ స్నేహం, హీరోయిన్ అధితి ఆర్యకు, కళ్యాణ్ రామ్ కు మధ్య లవ్ సీన్స్ కొన్ని బాగున్నాయి. పాటలు కూడా సందర్భానుసారంగా వస్తూ మంచి ఫీల్ ని ఇచ్చాయి. ముఖ్యంగా పూరి పాడిన పాట సినిమాకే హైలెట్‌.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మినహా మిగతా అన్ని సన్నివేశాలు ఊహాజనితంగానే ఉండి బోర్ కొట్టించాయి. సినిమా ప్రారంభానికి ముందే కళ్యాణ్ రామ్ ఓ జర్నలిస్ట్ అనే హింట్ తెలుస్తుంది. ఇంటర్ వెల్ వరకు దాచి పెట్టి…దాన్నో బ్యాంగ్ అన్నట్లు చూపించడం అతికినట్లుగా కనిపించలేదు. హీరో నల్ల ధనాన్ని ఇండియాకు తిరిగి తెప్పించడానికి, దోపిడీదారులను బయటకు లాగడానికి చేసిన ప్రయత్నాన్ని రఫ్ గా చూపించేసి వదిలేశారు.

సాంకేతిక విభాగం :

తన మార్క్‌ స్టైల్‌తో దర్శకుడు పూరి…హీరో కళ్యాణ్ రామ్ నుండి పూర్తి స్థాయి నటనను రాబట్టుకోవడంలో, అతన్ని కొత్తగా చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. రచయితగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ఆయన రాసిన డైలాగులు, బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్ గా ఉన్నాయి. ముఖ్యంగా కోర్టు సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయి. అనూపు రూబెన్స్ ఇచ్చిన సంగీతం బాగుంది. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

విదేశాల్లో నలధనం దాచుకొంటున్న ‘నల్ల దొరల’ గుట్టురట్టు చేసి.. ఆ డబ్బుని పేద ప్రజలకు పంచి పెట్టడం అన్నదే ఇజం సినిమా కథ. ఇలాంటి కథలు సామాన్య ప్రేక్షకుడికి ఈజీగా కనెక్ట్‌ అయిపోతాయి. గతంలో ఇలాంటి కథతో సినిమాలు చాలానే వచ్చాయి…కానీ బలమైన పాయింట్‌ని నమ్ముకుని పూరి తనదైన స్టైల్‌లో తెరకెక్కించిన విధానం బాగుంది. బోర్‌ కొట్టకుండా సాగిపోయే ఫస్టాఫ్, కళ్యాణ్ రామ్ నటన, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ప్లస్ పాయింట్స్ కాగా, ఊహాజనితమైన, బోరింగ్ సెకండాఫ్ కథనం,హడావిడిగా క్లైమాక్స్ ను చుట్టేయడం ఇందులో మైనస్ పాయింట్స్. మొత్తంగా సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ మూవీ ‘ఇజం’.

విడుదల తేదీ : 10/ 21/ 2016
రేటింగ్ : 3/5
నటీనటులు : కళ్యాణ్ రామ్, అధితి ఆర్య
సంగీతం : అనూప్ రూబెన్స్
నిర్మాత : కళ్యాణ్ రామ్
దర్శకత్వం : పూరి జగన్నాథ్

- Advertisement -