తనయుడికి పదవి ముఖ్యమంత్రి…వ్యూహమా..? అనివార్యమా..?

7
- Advertisement -

తమిళనాడు రాజకీయాలది దేశంలోని ప్రత్యేక స్థానం.. ఇక్కడ ఉన్నంత ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ అరుదుగానే చూడగలం. ఇపుడు తాజా పరిణామం తమిళనాట ఆసక్తికరంగా మారింది. గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగానే ఆయన చిన్న కుమారుడు ఎం.కే స్టాలిన్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత స్టాలిన్ సీఎం అయ్యాక ఆయన కుమారుడు , నటుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే తరహాలో పార్టీలో కీలకంగా మారారు. ఒకప్పుడు స్టాలిన్ ఏ ఫార్ములాతో రాజకీయాల్లో సక్సెస్ అయ్యారో.. ఇపుడు ఉదయనిధి స్టాలిన్ కూడా తండ్రినే ఫాలో అవుతున్నారు. మంత్రిగా, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం కాబోతున్నట్లు సమాచారం. ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయం కాదు ఇది.. అయినా ఇది వ్యూహమా..? లేక అనివార్యమా అన్నది చర్చనీయాంశంగా మారింది

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎం కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు తన అనంతరం వారసుడు ఎవరు అన్నదీ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చర్చ అనడం కన్నా అదో పెద్ద వివాదం అని చెప్పొచ్చు. అప్పటికే డీఎంకె యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ తన వారసుడు అంటూ కరుణానిధి స్వయంగా ప్రకటించారు పెద్ద కుమారుడైన అళగిరి కరుణానిధి వారసత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే వారసుడిగా తన అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా 2009 లోక్ సభ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా స్టాలిన్‌ను ఎంపిక చేశారు. ఆ సమయంలో కరుణానిధి ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించకపోవడం అటు పార్టీ ఇటు ప్రభుత్వం రెండు విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడన్న వ్యూహంతో ఆరోజు కరుణానిధి ఆ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధి మరణానంతరం స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు సీఎం అయ్యేందుకు ఆరోజు కరుణానిధి నిర్ణయం ఎంతగానో దోహదపడింది.

ప్రస్తుతం ఎంకే స్టాలిన్ కూడా అదే ఆలోచనతో తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు వారసత్వం దక్కాలన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు కల్పించిన స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ రాష్ట్ర యువజన సంక్షేమ క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న స్టాలిన్ ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించాలంటే మంత్రిగా కంటే ఉపముఖ్యమంత్రిగా ఉండడం మంచిదన్న ఆలోచనతో స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే 2026 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా డీఎంకేకు ప్రతిష్టాత్మకం కానున్నాయి. తమిళనాడులో డీఎంకే ఏఐడిఎంకె ప్రధాన పార్టీలుగా ఉండగా, వచ్చే ఎన్నికల్లో ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా బరిలో ఉండబోతోంది. దీంతో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే స్టాలిన్ తోపాటు తన అనుకున్న ముఖ్యమైన వారు పార్టీ బాధ్యతలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే వీలైనంత త్వరగా డిప్యూటీ సీఎం చేయడం, ఇటు పార్టీకి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు సులువుగా ఉంటుందని స్టాలిన్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

Also Read:KTR:కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు

మరోవైపు గతంలో తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడే డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీలో స్టాలిన్ మంచి పట్టు సాధించగలిగారు. ఇప్పుడు తన కుమారుడు ఉదయినిధి స్టాలిన్ కు కూడా అదే ఫార్ములా ఉపయోగపడుతుందని గట్టిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో ఈ ప్రకటన అధికారికంగా రానుంది. మరోవైపు సీఎం స్టాలిన్ తాజాగా అమెరికా పర్యటన తర్వాత హడావిడిగా తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. స్టాలన్ ఆరోగ్యం కూడా సహకరించడం లేదన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఉదయనిధి స్టాలిన్ ను పార్టీలో స్ట్రాంగ్ చేయాలన్న వ్యూహమూ ఉంది. స్టాలిన్ ఆరోగ్యం సరిగా లేని కారణంగా నిర్ణయం అనివార్యంగానూ చెబుతున్నారు.

- Advertisement -