షర్మిల చంద్రబాబు దోస్తీ.. నిజమేనా?

21
- Advertisement -

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబుతో చేతులు కలిపారా ? వైసీపీ టార్గెట్ గా ఆమె వ్యూహాలు చంద్రబాబు వేనా ? అంటే అవుననే చెబుతున్నారు వైసీపీ నేతలు. ఎందుకంటే షర్మిల వ్యహరిస్తున్న తీరు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమౌతుందనేది వైసీపీ వర్గం నుంచి వినిపిస్తున్న మాట. ఆమె చేసే విమర్శలన్నీ వైసీపీ టార్గెట్ గా ఉండడం ఒక కారణమైతే, టీడీపీ శ్రేణులు షర్మిల విషయంలో ఎలాంటి విమర్శలు చేయకపోవడం మరో కారణం. దీంతో ఏపీ కాంగ్రెస్ మరియు టీడీపీ మద్య అంతర్గత పొత్తు ఉందనేది వైసీపీ నేతలు చెబుతున్న మాట. అయితే ఈ రకమైన సందేహాలు రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ గట్టిగానే మద్దతు పలికింది. అటు కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీని అంటిపెట్టుకొనే ఉన్నారు.

ఇప్పుడు అదే విధంగా ఏపీలో కూడా ఈ దోస్తీ కొనసాగించే దిశగా అడుగులు పడుతున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ మరియు కాంగ్రెస్ మద్య అంతర్గత పొత్తు కారణంగానే బీజేపీ టీడీపీకి దూరంగా ఉంటోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మద్య బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించినప్పటికి కాషాయ పెద్దలు ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతో బీజేపీ కలవకపోతే కాంగ్రెస్ ను కలుపుకొని ఎన్నికలకు వెళ్ళేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే ఏపీలో కాంగ్రెస్ టీడీపీ చేతులు కలిపితే.. టీడీపీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఏర్పడిన టీడీపీ తిరిగి అదే పార్టీతో చేతులు కలపడం ప్రజా వ్యతిరేకతకు కారణమౌతుంది. 2018 తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే చేసి చేతులు కాల్చుకున్నారు. దాంతో చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ తో కలిసే ప్రయత్నం చేస్తారా ? అంటే చెప్పలేని పరిస్థితి. అయితే రెండు పార్టీల మద్య ప్రత్యక్ష పొత్తు లేకపోయినప్పటికి పరోక్ష ఒప్పందాలు ఉండే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. మరి వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా టీడీపీ కాంగ్రెస్ మద్య దోస్తీ ఎప్పుడు బయట పడుతుందో చూడాలి.

Also Read:బొల్లి మచ్చలకు పరిష్కారం ఉందా?

- Advertisement -