టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్… బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను కోల్‌కతాలో కలవడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ భేటీ జరగడం వల్ల, పేస్ రాజకీయాల్లోకి అడుగుపెడతాడా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
మీడియా కథనాల ప్రకారం, నితిన్ నబిన్ కోల్‌కతా పర్యటనలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య కూడా పాల్గొనడం మరింత ఆసక్తి కలిగించింది. పార్టీ వర్గాలు చెప్పినట్లుగా, పేస్ రాజకీయాల్లోకి రావడం గురించి చర్చ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
లియాండర్ పేస్ గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. 2021లో మమతా బెనర్జీ సమక్షంలో గోవాలో ఆ పార్టీలో చేరారు. అయితే తర్వాత ఆయనకు పార్టీ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కలేదు. దీంతో ఆయన రాజకీయాల్లో పెద్దగా చురుకుగా కనిపించలేదు. తాజాగా బీజేపీ నేతలతో సమావేశం కావడంతో, ఆయన పార్టీ మార్పు గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 294 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను ప్రకటించనున్నారు.
Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

