గత ఎన్నికల్లో కానీ విని ఎరుగని రీతిలో 151 స్థానాల్లో గెలుపు .. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాల్లో గెలుపు కోసం టార్గెట్.. తన పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని, అందుకే వై నాట్ 175 అంటున్నట్లు నిన్న మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో భారీగా మార్పులు కూడా చేపట్టారు. అయితే రియాలిటీలో జగన్ కు సత్యం బోధ పడిందా ? అందుకే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు విషయంలో జగన్ కొంత సందేహంగానే ఉన్నారా ? ఇటీవల జాతీయ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. .
ఇండియా టుడే ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ ” ఎక్కడలేని విధంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామని, తమ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చెబుతూ ఒకవేళ అధికారం కోల్పోవాల్సి వస్తే తాను నిరాశ చెందనని, ఇప్పటివరకు తాను సాగించిన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. ” జగన్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. గతంలో మరో ముప్పై ఏళ్ల వరకు అధికారం మనదే అని చెప్పిన జగన్ సడన్ గా అధికారం కోల్పోయిన పర్వాలేదని చెప్పడం ఏంటని తలలు పట్టుకుంటున్నారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ” జగన్ ప్యాకప్.. వైసీపీ హ్యాండప్ ” అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. అటు వైసీపీ నేతల్లో కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు తవిస్తున్నట్లు తెలుస్తోంది. అధినేతలోనే కాన్ఫిడెన్స్ లోపిస్తే గెలుపు కష్టమే అనే భయాందోళనలో వైసీపీ నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఇప్పటికే అభ్యర్థిల విషయంలో భారీగా మార్పులు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ మార్పులకు కారణం ఓటమి భయమే అనే టాక్ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఇప్పుడు స్వయంగా జగనే ఆ రకమైన వ్యాఖ్యలు చేయడంతో వైసీపీకి తత్వం బోధ పడిందనే టాక్ వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎలా అడుగులు వేస్తారో చూడాలి.
Also Read:కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌పీపీ సమావేశం