టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలు అవుతున్న ఆయన బయటకు రావడం లేదు. బెయిల్ విషయంలో ఎప్పటికప్పుడు వాయిదాలా పర్వం నడుస్తోంది. అయితే చంద్రబాబు జైల్లో ఉన్న తరువాత ఆయన భద్రత పై తరచూ అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఆయనను జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని గత కొన్నాళ్లుగా టీడీపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భద్రత విషయంలో స్వయంగా చంద్రబాబే జడ్జికి లేఖ రాయడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఈ అంశం హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. తన ఆరోగ్యం, భద్రత పై ఆందోళనగా ఉందని, తాను జైలుకు వచ్చినప్పుడు అనధికారంగా వీడియోలు, ఫోటోలు తీశారని, తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారని, తనకు భద్రత పెంచాలని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. .
దీంతో చంద్రబాబు మర్డర్ కు ప్లాన్ జరుగుతోందని టీడీపీ శ్రేణులు గట్టిగా వాపోతున్నారు. దానికితోడు ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. 2024 తరువాత చంద్రబాబు చస్తాడని గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాంతో వైసీపీ పార్టీ చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ తరహా వార్తలను వైసీపీ లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును చంపాల్సిన అవసరం వైసీపీ నేతలకు లేదని, సానుభూతి కోసమే చంద్రబాబు ఈ తరహా వివాదానికి తెర తీస్తున్నారని వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. మరి చంద్రబాబు మర్డర్ ప్లాన్ విషయాన్ని కోర్టు సీరియస్ గా తీసుకొని భద్రతను పెంచుతుందా లేదా లైట్ తీసుకుంటుందా అనేది చూడాలి.
Also Read:కాంగ్రెస్‌లో టికెట్ల చిచ్చు!