భారత సీనియర్ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇర్ఫాన్ పఠాన్ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలినాళ్లలో సంచలన క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నా, ఆ తర్వాత నిలకడలేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. 2003లో ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టిన ఇర్ఫాన్ 2012లో చివరి సారిగా భారత తరపున ఆడాడు.
29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడి మొత్తం 301 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 2007 ట్వంటీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఇర్ఫాన్ ఉన్నాడు. టోర్నీలో పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. 2017లో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆయన తిరిగి ఐపీఎల్ లో తన పేరు నమోదు చేసుకోలేదు. 2006లో పాక్ గడ్డపై టెస్టులో తొలి ఓవర్లో హ్యాట్రిక్ తీసి రికార్డ్ సృష్టించాడు.