ఎట్టకేలకు అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ వార్‌కు ఎండ్ కార్డు పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
రెండు దేశాల మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న శత్రుత్వానికి ముగింపు పలికే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడింది. యునైటెడ్ స్టేట్స్‌తో (అమెరికా) తమకు శాంతి అవగాహన కుదిరిందని ఇరాన్ న్యాయ మరియు అంతర్జాతీయ వ్యవహారాల ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాది ధృవీకరించారు.
ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిందని హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. అయితే తుది ఒప్పందంపై మరిన్ని చర్చలు జరగడం అనేది.. ప్రాథమిక అవగాహనలో పేర్కొన్న పలు నిబద్ధతలను వాషింగ్టన్ నెరవేర్చడంపైనే ఆధారపడి ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.
ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక సంతకాల కార్యక్రమం శుక్రవారం జరగనుంది. సంతకాలు పూర్తయిన తర్వాత ఈ అవగాహన ఒప్పందం (MoU) యొక్క పూర్తి పాఠాన్ని ప్రజల ముందుకు ఉంచుతామని ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ ఒప్పందం గురించి ఘరీబాబాది మాట్లాడుతూ.. ఇరాన్ తన ప్రధాన డిమాండ్లను ఈ ముసాయిదా పత్రంలో విజయవంతంగా చేర్చగలిగిందని చెప్పారు. ఈ ఫలితం దౌత్యం మరియు సైనిక ప్రతిఘటన రెండింటి వల్లనే సాధ్యమైందని ఆయన అభివర్ణించారు.
దుష్ట లక్ష్యాలతో దాడికి దిగిన శత్రువు తన అన్ని లక్ష్యాలలోనూ పరాజయాన్ని చవిచూశాడు. ఈ యుద్ధంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గొప్ప విజయాలను సాధించింది. ఈ అవగాహన ఒప్పందం కేవలం దౌత్యం వల్ల మాత్రమే రాలేదు, ఇది ఇరాన్ సైనిక విజయాలకు రుణపడి ఉంది. వ్యవస్థ శత్రువులను ఎదుర్కొనే క్రమంలో మన అమరవీరులు చిందించిన పవిత్ర రక్తానికి ఇది రుణపడి ఉంది అని ఘరీబాబాది అన్నారు.
Also Read:ఎన్నారై కాదు..మార్గదర్శి!
సమగ్ర ఒప్పందం కోసం ప్రతిపాదించిన 60 రోజుల చర్చల వ్యవధిలోకి తాము తక్షణమే ప్రవేశించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. శత్రుత్వాన్ని ముగించడం, నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించడం మరియు ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి అంశాలపై అమెరికా తన వాగ్దానాలను నెరవేర్చిందా లేదా అనేదాన్ని టెహ్రాన్ (ఇరాన్) మొదట పరిశీలిస్తుందని ఘరీబాబాది తెలిపారు. 60 రోజుల చర్చల్లోకి ప్రవేశించడం అనేది.. అమెరికా తన బాధ్యతలను నెరవేర్చడంపైనే ఆధారపడి ఉంటుంది అని ఘరీబాబాది చెప్పారు.అలాగే ఈ అవగాహన ఒప్పందాన్ని వాషింగ్టన్ ఉద్దేశాలపై నమ్మకానికి సంకేతంగా భావించకూడదని ఆయన చెప్పారు.ఈ అవగాహన ఒప్పందం అంటే శత్రువును నమ్మడం అని కాదు అని …అమెరికా తన కట్టుబాట్లను ఎలా అమలు చేస్తుందో మేము నిశితంగా గమనిస్తాం అని చెప్పుకొచ్చారు.

