ఐపీఎల్‌ 10:ఆరంభం-ముగింపు హైదరాబాద్‌లోనే

236
IPL 2017: Schedule
- Advertisement -

ఐపీఎల్ పదో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌కి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం దూరం కానుందన్న వార్తలకు చెక్ పడింది. హైదరాబాద్‌లోనే ఆరంభ,ముగింపు మ్యాచ్ జరగనుంది. హెచ్‌సీఏ  సరిగా వేతనాలు చెల్లించడం లేదంటూ స్టేడియం సిబ్బంది దాదాపు మూడు వారాల నుంచి సమ్మె చేస్తున్నారు. దీంతో పిచ్, ఔట్ ఫీల్డ్‌ని శుభ్రం చేసేవారు లేకపోవడంతో మైదానంలో చెత్త పేరుకుపోయింది.ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై సందేహం నెలకొంది. అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతూ తొలి మ్యాచ్ ఉప్పల్‌లోనే జరుగుతుందని హెచ్‌సీఏ సెక్రటరీ జాన్ మనోజ్ వెల్లడించారు.

ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్‌ సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. దేశంలో వివిధ మైదానాల్లో పది వేదికల్లో 47 రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం 60 మ్యాచులను నిర్వహించనున్నట్టు బీసీసీఐ తన షెడ్యూల్‌లో పేర్కొంది. ఇందులో ప్రతి జట్టు 14 మ్యాచ్‌లు ఇతర జట్లతో ఆడనున్నాయి.

ఈనెల చివర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్‌ కోసం ఉప్పల్ స్టేడియానికి రానుందని మనోజ్ తెలిపారు. మరోవైపు మ్యాచ్‌ కోసం పిచ్‌ని సిద్ధం చేయాలంటే కనీసం 15 రోజులు పడుతుందని క్యూరేటర్స్ చెప్తుంటారు. అయితే ప్రస్తుతం సెక్రటరీ మాటల్ని బట్టి చూస్తే సిబ్బంది సమ్మెను విరమించుకుని ఇప్పటికే పిచ్‌ తయారీకి సిద్ధమైనట్లేనని తెలుస్తోంది. తొలి మ్యాచ్‌‌కి ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 4న ఐపీఎల్ సీజన్ ఆరంభోత్సవ కార్యక్రమం ఉప్పల్‌లో జరగనుంది.

- Advertisement -