ప్రస్తుతం థ్రిల్లర్ జానర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘మధ’ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ ‘హత్య’ అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం జనవరి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు రవివర్మ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా…
చిత్ర దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘‘నా తొలి చిత్రం మధ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన మీడియాకు, ఆదరించిన అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నేను హత్య సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. థ్రిల్లర్ జోనర్‌లోనే రెండో సినిమా కూడా చేస్తున్నాను. ఇది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా అలరించేలా తెరకెక్కించాను. చాలా హార్డ్ వర్క్, ఎఫర్ట్స్ పెట్టి స్క్రీన్ ప్లే రాసుకుని చేసిన సినిమా ఇది. ఈ ప్రయాణంలో నాకెంతో సపోర్ట్ చేసిన నటీనటులు ధన్య బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్ సహా అందరికీ థాంక్స్. నరేష్ అద్భుతమైన బీజీఎంను అందించాడు. అభిరాజ్ విజువల్స్ చక్కగా కుదిరాయి. అనిల్ ఎడిటింగ్ సినిమాను మరింత క్యూరియస్‌గా మార్చింది. మధ సమయంలో రవివర్మగారు నాకు పరిచయం అయ్యారు. కలిసి పని చేద్దామని అన్నారు. అంత మంచి నటుడు నన్ను అప్రోచ్ కాగానే నాకెంతో సంతోషమేసింది. ఇప్పుడు హత్య స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు రవిగారిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. నెక్ట్స్ లెవల్ యూనిక్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. పూజా రామచంద్రన్ రోల్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆమె తన నటనతో దాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ధన్య బాలకృష్ణ కూడా ఎంతో సపోర్ట్ చేసింది. సినిమాను బాగా తీయటానికి ఏం చేయాలని అని ఆలోచించి చేసే టీమ్‌తో పని చేయటం ఎంతో ప్లస్ అయ్యింది. మా నిర్మాత ప్రశాంత్‌గారికి థాంక్స్. ప్రేక్షకులు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
ఈ చిత్రానికి అభిరాజ్ రాజేంద్రన్ నాయర్ సినిమాటోగ్రఫర్‌గా, నరేష్ కుమారన్.పి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. అనిల్ కుమార్ పి ఈ చిత్రానికి ఎడిటర్‌గా, ఎస్ ప్రశాంత్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్లు ఇవ్వనున్నట్టుగా టీం ప్రకటించింది.
Also Read:హైదరాబాద్‌ను ప్రతిబింబించేలా వరంగల్ అభివృద్ధి