బీజేపీలో పాతవారికే పెద్దపీట
కొత్త వారిని పార్టీకి వాడుకోవడమే…
బిజేపీలో రగులుతున్న అసంతృప్తి సెగలు
అసంతృప్తిలో విజయశాంతి, డి.కె.అరుణ
ఇతర పార్టీల నుంచి వచ్చేవారు ద్వితీయ శ్రేణి పౌరులే..?
భారతీయ జనతాపార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంలో పలువురు నేతలు అంతులేని అసంతృప్తితో రగిలిపోతున్నారా…అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. పార్టీల నుంచి వలసవచ్చి బిజెపిలో చేరిన నాయకుల్లో కొందరు సీనియర్లు నిరాశా, నిసుహలతో కొట్టుమిట్టాడుతున్నారనే విమర్శలున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఇప్పటికీ ద్వితీయ శ్రేణి వ్యక్తులుగానే చూస్తున్నారని, అంతేగాక తెలంగాణ బి.జె.పి.లో విద్యార్ధి నాయకులుగా పనిచేసి పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పనిచేస్తున్న వారికే అధిష్టానం, అగ్రనాయకత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుండటం, కొత్త వారిని అలంకార ప్రాయమైన పదవుల్లో కూర్చోబెట్టి పక్కనబెట్టారనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. దీనికితోడు ఇతర పార్టీల నుంచి వచ్చి బి.జె.పి.లో చేరిన వారికి తమ పార్టీ సిద్ధాంతాలపట్ల పెద్దగా గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉన్నట్లుగా లేదని, వారిని పార్టీకి వాడుకోవడం, ఎన్నికల్లో వారికి కేటాయించిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లలో డబ్బును ఖర్చు చేసుకొని గెలిచివచ్చేంత వరకేనని, పార్టీకి వారిని వాడుకోవడమే గానీ, అంతకు మించి కీలకమైన బాధ్యతలు, అంతర్గత వ్యవహారాల్లో వారిని కలుపుకొనిపోయేది ఏమీ ఉండదని పార్టీ అగ్రనేతలు ఎంతో స్పష్టంగా చెప్పారని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. అందుకే అనేక దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న వారికే కీలకమైన పదవులు వచ్చాయని అంటున్నారు.
అందుకే కొత్తగా పార్టీలో చేరిన ఇతర పార్టీల నేతలు అసంతృప్తులతో రగిలిపోతున్నారని, ఇది తాము ఊహించిందేనని కొందరు సీనియర్ నాయకులు బాహాటగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు విజయశాంతిలు పార్టీలో ఇమడలేక సతమతమవుతున్నారనే విమర్శలున్నాయి. బిజెపి సిద్ధాంతాలు, క్రమశిక్షణ, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే విధానం, మీడియా సమావేశాల్లో పాల్గొనే పద్దతులు, పాత్రికేయులకు ఇంటర్వ్యూలు ఇచ్చే అంశాలు, వివిధ సంఘటనలు, రాజకీయపరమైన విమర్శలపైన కూడా స్వేచ్చగా మాట్లాడే అవకాశాలు లేకపోవడం, పార్టీ కార్యకలాపాల్లో కలుపుకొని పోవడంలేదనే తదితర కారణాలతో ఈ ఇద్దరు మహిళా నేతలు అసంతృప్తితో ఉన్నారని పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు తెలిపారు. అంతేగాక పార్టీలో చేరినప్పుడు ఉన్నప్పటి జోష్ తరువాత లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చి బి.జె.పి.లో అలంకా రప్రాయమైన పోస్టులు ఇచ్చి మూలన కూర్చోబెడుతున్నారని, పార్టీ అంతర్గత వ్యవహారాల్లోగానీ, కీలకమైన పార్టీ కార్యకలాపాల్లోగానీ తమను పూర్తిగా పక్కనబెడుతున్నారని ఆ నేతలు మదనపడుతున్నారని కొందరు సన్నిహితమైన నేతలు వివరించారు. అంతేగాక బి.జె.పి. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కూడా పాత వారికి ఉన్నంతటి గౌరవ, మర్యాదలు కొత్తగా ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన నేతలకు ఆ రిసీవింగ్ లేదని, పార్టీ ఫక్షనింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటోందని, అదే తమ నేతలకు చాలా ఇబ్బందికరంగా ఉంటోందని, తమ నేతల సీనియారిటీని కూడా పార్టీ కార్యాలయంలో పనిచేసే ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా పెద్దగా ఖాతరు చేయడం లేదని అంటున్నారు. మీడియా సమావేశాలు పెట్టాలన్నా కార్యాలయ ఇన్ చార్జిలు, పార్టీ అధ్యక్షుడి అనుమతులు తీసుకోవాల్సిందేనని, దాంతో ఫైర్ బ్రాండ్లుగా పేరు సంపాదించుకొన్న డి.కె.అరుణ, విజయశాంతిలు సైతం మౌనంగా ఇంట్లో కూర్చోవాల్సి వస్తోందని, ఈ పరిణామాలను జీర్ణించుకోలేకనే ఇటీవల రాములమ్మ (విజయశాంతి) బహిరంగంగానే అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పై విమర్శనాస్త్రాలను సంధించారని, సంజయ్ తమను పట్టించుకోవడం లేదని, ప్రజా సమస్యలపై పోరాటాలు చేసే సమయంలో తమను కలుపుకొని పోవడంలేదని విజయశాంతి ఆవేదన వ్యక్తంచేసిన సంగతులను గుర్తు చేస్తున్నారు.
ఇప్పటికి డి.కె.అరుణ, విజయశాంతిలు మాత్రమే కాదని, కొత్తగా పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అయినా… ఇంకెవ్వరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుందని, ఇతర పార్టీల నుంచి బి.జె.పి.లో చేరే నాయకులు పార్టీకి ఉపయోగపడాలే గానీ పార్టీ వారి కోసం అదనంగా చేసే హెల్ప్ ఏమీ ఉండదని, అసెంబ్లీ నియోజకవర్గాల్లోగానీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు బి.జె.పి.టిక్కెట్టు ఇవ్వడమే గొప్ప అని అగ్రనాయకత్వం అభిప్రాయపడుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కీలకమైన సమావేశంలో పార్టీ సిద్ధాంతాలతో ఎబివిపి, బిజెవైఎం లలో పనిచేసి బిజెపిలో రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారికే మళ్ళీ పదవులు, బాధ్యతలు కట్టబెట్టారని, అందుకు కాసం వెంకటేశ్వర్లు పేరును ఉదాహరణగా చెబుతున్నారు. డాక్టర్ కె.లక్ష్మణకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగుతుండగానే ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ ఎంపీగా చేసిన బి.జె.పి.అధిష్టానం వైఖరిని చలా స్పష్టంగా చెప్పకనే చెప్పిందని, అందుచేతనే నిన్నామొన్నటి వరకూ కాస్తంత అసంతృప్తితో ఉన్న పాత నాయకులకు మళ్లీ కీలకమైన పదవులు, బాధ్యతలు దక్కడంతో సిద్ధాంతాలతో పనిచేస్తూ వచ్చిన నాయకులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారని ఆ నేతలు వివరించారు. ఈ అసంతృప్తులు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.