ఆడాళ్లు మీకు జోహార్లు

601
she teams
- Advertisement -

ఆమె… నిన్నటి సమాజానికి అందం.. నేటి సమాజానికి స్పూర్తి.. రేపటి సమాజానికి వెలుగు… అవనిలో సగం.. అతనిలో అర్థ భాగం.. లాలించే తల్లిలా.. ప్రేమపంచే ప్రియురాలుగా.. ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తోంది. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పండుగలోకి మన దేశంలోని మహిళలకు కాస్తంత చేదు గుళికలనే మింగించింది. పూర్వకాలంలో స్త్రీలు వంటగదికే పరిమితమయ్యేవారు, బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి ఆచారాలతో మహిళలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

ఫ్యాక్టరీల్లో పనిచేసే చోట దుర్బర పరిస్ధితులు వేతనాలు జీతాల్లో అసమానతల్ని నిరసిస్తూ 1857లో మార్చిలో న్యూయర్క్‌లో గార్మెంట్స్ ఉమెన్ వర్కర్స్ కదం తొక్కారు.  నాడు చేసిన సమ్మె తర్వాత కాలంలో ఉద్యమానికి ఊపిరిలూదింది. మహిళా దినోత్సవం ఆవిర్భవించేలా చేసింది. సరిగ్గా 50 ఏళ్ల తర్వాత మార్చి నెలలో న్యూయార్క్‌ నగర వీధుల్లో పనివేళలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, బాలకార్మికులను నియమించరాదని, ఓటు హక్కు కల్పించాలని మహిళలు డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. బ్రెడ్ అండ్ రోజెస్ నినాదంతో కదం తొక్కారు. దీంతో నాడు అమెరికా ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. 1909 ఫిబ్రవరి 28న తొలిసారిగా జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంది అమెరికా సమాజం. 1975 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది ఐక్యరాజ్యసమితి.

ఏటా మహిళల అభ్యున్నతికి సాధిస్తున్న ప్రగతిని నెమరువేసుకుంటూ, అసమానతల్ని  గుర్తించి వాటిని పరిష్కరించుకునే దిశగా ముందడుగు వేయడానికి మంచివేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం. తాము సగభాగం ఉన్న సమాజంలో సమాన హక్కులకోసం.. సమాన అవకాశాల కోసం.. సమసమాజం కోసం.. ఒక లక్షిత పోరాటం ఆకాంక్ష ఏండ్లనాటిదేనైనా.. మార్చి 8 ఒక మజిలీ.

శతాబ్దాల సంకెళ్లను ఒక్కొక్కటిగా తెంచుకుంటూ ముందుకు సాగుతున్నా.. ఇంకా అనేక అమానుషాలు.. అవమానాలు  క్రీడలు మొదలుకుని.. ఆర్థిక వ్యవస్థ.. అంతరిక్షం.. అంతర్జాలాన్ని సైతం శాసించే స్థాయికి మహిళ ఎదుగుతున్నా.. ఇంకా అవే అన్యాయాలు జరుగుతునే ఉన్నాయి. మహిళలు రోడ్లపై నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇంకా ఎండమావే.  తన బతుకు మారే రోజు కోసం ఓపికగా ఎదురు చూస్తున్నది అబల.  ఆటంకాలెన్ని ఎదురైనా.. తలవంచక.. పురుషాధిక్య సమాజానికి సవాలు విసురుతున్నది.

అనేక విజయాలూ తన సిగలో పొదువుకుంటూనే ఉన్నది. ఎంతోమంది వీర వనితలు… ఎన్నో పోరాటాలు.. ఆడుగడుగునా ఆటంకాలు.. చరిత్రలోని మొదటి పేజీ నుంచి ఈరోజు వరకు, దేశంలో స్త్రీల పాత్ర గురించి చెప్పనక్కర్లేదు. నిన్నటికి నిన్న ఇస్రోలో రికార్డుస్థాయి ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్తలే నిదర్శనం. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సింధూయే సాక్ష్యం. ఇంకా ఎంతో  మంది  స్ఫూర్తి కిరణాలకు.. ఆ సహనశీలురకు మహిళా దినోత్సవం సందర్భంగా పాదాభివందనం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -