సుస్థిర పర్యావరణం, విద్యార్థుల పాత్రపై అంతర్జాతీయ సదస్సు

0
- Advertisement -

పర్యావరణహిత సుస్థిర అభివృద్ధిలో విద్యార్థులను మరింతగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని డిల్లీలో జరిగిన యునెస్కో పర్యావరణ సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు. సుస్థిర పర్యావరణం, విద్యార్థుల పాత్ర పై ఆరవ అంతర్జాతీయ సదస్సు (International Conference On Sustainability Education- ICSE) రెండు రోజుల పాటు ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్ లో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందినటువంటి పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ప్రకృతి రక్షణలో పాఠశాల, కాలేజీ విద్యార్థులను గేమ్‌ ఛేంజర్లుగా తీర్చి దిద్దాలని ఈ యునెస్కో సదస్సులో పాల్గొన్న నిపుణులు సూచించారు.

రానున్న రోజుల్లో పర్యావరణపరంగా మానవాళికి పొంచి ఉన్న ముప్పును ఇప్పటినుంచే విద్యార్థులకు తెలియజేసి, ప్రకృతి పట్ల తగిన బాధ్యతతో ప్రవర్తించాల్సిన తీరును వారికి నేర్పాల్సిన అవసరం ఉందని క్లైమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఇండియా & సౌత్ ఆసియా) డాక్టర్ ఆదిత్య పండిట్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ సదస్సులో పాల్గొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలను వివరించారు. ప్రకృతి పునరుద్ధరణలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సమాజంలో ప్రభావిత వ్యక్తులను ఇందులో భాగస్వాములు చేయడం లాంటి కార్యక్రమాలు గత ఏడేళ్లుగా చేపడుతున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తిని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభినందించారు.

వివిధ స్కూళ్ళలో విద్యనభ్యసిస్తూ పర్యావరణ రక్షణ పరంగా ప్రతిభ కనపరుస్తున్న విద్యార్థులకు సంతోష్ కుమార్ చేతుల మీదుగా నిర్వాహకులు అవార్డులను అందించారు. ఈ సదస్సులో కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మాజీ సెక్రెటరీ ప్రవీణ్ గారే, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పద్మశ్రీ కార్తికేయ సారాభాయ్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పయంగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ లు పాల్గొని ప్రసంగించారు. అడవులను కాపాడటం, నీటి వనరుల రక్షణ ప్రస్తుతం సమాజం ముందున్న అతిపెద్ద సవాల్ అని వారు అన్నారు. విద్యార్థులకు ఈ విషయాలపై తగిన అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి పర్యటనతో కూడిన బోధనా విద్య ఉండాలని వారు అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు తద్వారా ఎదుర్కోబోయే సమస్యల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలిగించేలా సిలబస్ లో మార్పులతో పాటు తరగతి గదుల్లో కూడా ఆ విధమైన విద్య అభ్యసించేలా ఉండాలని అందుకు తగిన మార్పుచేర్పులను కేంద్రం చేపట్టాలని నిపుణులు సూచించారు. పర్యావరణ విద్యలో క్షేత్రస్థాయిలో పరిశీలన, విద్యార్థులకు అవగతం కూడా అత్యంత ముఖ్యమైన విషయమని వారు అన్నారు.

పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ పై అధ్యయనం చేస్తున్న వివిధ దేశాలకు చెందినటువంటి శాస్త్రవేత్తలు పర్యావరణ నిపుణులు ప్యానెల్ చర్చల్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో రీతు రాజ్ పుకాన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమన్వయకర్తలు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

Also Read:ఫోర్త్ సిటీ కాదు.. ఫోర్ బ్ర‌ద‌ర్స్ సిటీ: కేటీఆర్

- Advertisement -