డొనాల్డ్ ట్రంప్ దెబ్బతో అమెరికాలో ఉన్న భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. హెచ్1బీ వీసాపై ఆంక్షలు విధించిన డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు దిగొచ్చాయి. అంతేకాదు స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు షాక్ ఇచ్చింది ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.
రాబోయే రెండేళ్లలో అమెరికాలో భారీ సంఖ్యలో అమెరికన్ ఉద్యోగులను నియమించుకుంటున్నట్టు ప్రకటించింది ఇన్ఫోసిస్. అమెరికాలో స్థానికులకు ప్రాముఖ్యతను ఇస్తామని తెలిపింది. ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో సుమారు 10 వేల మంది అమెరికన్లను నియమించుకోవడానికి ఇన్ఫోసిస్ రెడీ అవుతోంది. హెచ్1బీ వీసాపై ఆంక్షలు విధించడంతో..వేరే గత్యంతరం లేకే ఇన్ఫోసిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా అమెరికాలో కొత్తగా నాలుగు టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించనున్నామని… అందులో మొదటి సెంటర్ ను ఆగస్టు నెలలో ఇండియానాలో ప్రారంభించనున్నట్టు ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా తెలిపారు. ఇదిలాఉంటే..ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లాంటి భారత కంపెనీలు హెచ్-1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించాయని అమెరికా ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
లాటరీ విధానంలో అదనపు దరఖాస్తు జతచేయడం ద్వారా ఆ కంపెనీలు ఎక్కువ వీసాలు పొందగలిగాయని, ఇలా చేయడం అన్యాయమని పేర్కొంది. ఈ నేపథ్యంలోఇన్ఫోసిస్ తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తిగా మారింది. ఇక ఇదిలాఉంటే.. ఇన్ఫోసిస్ దెబ్బతో భారతీయులకు, ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీలకు గడ్డుకాలమనే చెప్పాలి. అంతేకాదు రాను రాను భారతీయ టెక్కీలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకోవాల్సిందేనని నిపుణులు అంటున్నారు.