నగరంలో పురాతన మెట్ల బావు లను పునరుద్ధరించి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ఒప్పంద పత్రాలు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ సంస్థ ఒప్పందం చేసుకుంది. సాయి లైఫ్ సంస్థ మంచిరేవుల మెట్ల బావిని దత్తత తీసుకుంది. భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను పునరుద్దరించనున్నది. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్ నుమా మెట్ల బావిని టీజీ ఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నది.
మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది.
ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐ కి సూచించారు.ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Also Read:విద్యార్థుల కోసం తెలంగాణ దర్శిని..