ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలు గోదావరి ప్రాణహిత నదుల ముంపు గ్రామాలపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంచిర్యాలలోని సీసీ గెస్ట్ హౌస్ జిల్లా స్థాయిలో సమీక్షించారు. ఈ సమావేశాన్నికి మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతి హొళికెరి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని దొరచెరువు, చింతలకుంట చెరువు, పెద్దచెరువు, ఊర చెరువు, బంటోనికుంట చెరువు, గొల్లవాగు కాలువ కు సంబంధించి ఎలకేశ్వరం-ఓత్కులపల్లి గ్రామాల వద్ద మరమ్మతులు, ఎర్రగుంట చెరువు, టేకులకుంట చెరువు మరమ్మతులకు ఇరిగేషన్ శాఖ నుంచి రూ.66లక్షల నిధులు అవసరమని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
పూర్తిస్థాయి ఆస్తి నష్టం వివరాలను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వివరిస్తామన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలతో కోతకు గురైన రోడ్లు, చెక్ డ్యామ్స్ మరమ్మతులకు ఆర్అండ్‌బీ శాఖ నుంచి రూ.1.75 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.50లక్షల నిధులు అవసరమని అంచనా వేశారు. అవసరమైతే నిధులకు సంబంధించి పునః సమీక్షించనున్నట్లు తెలిపారు. అత్యధిక వర్షపాతం కలిగిన జిల్లా కాబట్టి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రిని విప్ కోరారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎగువన ఇండ్ల స్థలాలు ఇవ్వడం, కరకట్టలు కట్టడం, చెరువులు, వాగుల బ్యాక్ వాటర్ ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అవసరమైన రోడ్లు, బ్రిడ్జిలకు సంబంధించి అధికారులు నివేదిక అందించాలని కోరారు. జిల్లాలో ముంపునకు గురయ్యే భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారానికి సంబంధించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
జిల్లా కేంద్రంలో శాశ్వతంగా ఎన్డీఆర్ఎఫ్ యూనిట్‌తో పాటు బోట్లు, రెస్క్యూ ఆపరేషన్ టీం ఉండేలా చూడాలని విప్ బాల్క సుమన్ కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందే తామంతా అప్రమత్తమయ్యామని, నదుల పరివాహక గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, తామందరం క్షేత్రస్థాయిలో పని చేయడంతోనే ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోగలిగామని గుర్తుచేశారు. ఇద్దరు సింగరేణి సిబ్బంది మృతి ఎంతగానో బాధించిందన్నారు. విపత్కర సమయంలో అద్భుతంగా పని చేసిన ప్రభుత్వ అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.