విద్యా, నైపుణ్యాభివృద్ధిలో ముందంజలో తెలంగాణ

459
IK Reddy
- Advertisement -

విద్యాప్రమాణాలు, నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ ముందంజవేస్తున్నదని, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుంద‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో అమెరికా దేశం అలబామా రాష్ట్రంలోని ఆబర్న్‌ యూనివర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ -(FCRI) మధ్య విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. అర‌ణ్య భ‌వ‌న్ లోని మంత్రి చాంబ‌ర్ లో ఆబర్న్‌ యూనివర్సిటీ డీన్ జాన‌కి రాంరెడ్డి, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఎంఓయూపై సంతకాలు చేసి, ఒప్పంద‌ పత్రాలను మార్చుకున్నారు.

ఈ సంద‌ర్బంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ…. విద్యావిధానం ప్రపంచీకరణ జరిగిన నేపథ్యంలో అమెరికాలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఒక‌టైన అబర్న్ విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం వల్ల ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు కలుగుతుందన్నారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతోపాటు పరిశోధన వల్ల కలిగే ప్రయోజనంతో అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చుని తెలిపారు. నాణ్యమైన, లబ్ధిదాయకమైన విద్యను అందించి అటవీ యాజమాన్యంలో విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను స్థాపించడానికి పునాది వేశారన్నారు.సీయం కేసీఆర్ ఆలోచ‌న‌లు, ఆశ‌యాల‌కు అనుగుణంగా ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దటం జ‌రుగుతోందని వెల్ల‌డించారు. అందులో భాగంగానే ఎఫ్‌సీఆర్‌ఐలో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అటవీ విద్యను అందించడానికి రెండు సంస్థ‌ల‌ మధ్య విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని చెప్పారు. అటవీశాస్త్ర పరిజ్ఞానంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు, విద్యాప్రమాణాల పెంపు దిశగా ఇది ఒక మైలు రాయి కాగలదనే అశాభావం వ్య‌క్తం చేశారు. ఆబర్న్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సైన్సెస్‌ డీన్‌ డాక్టర్‌ జానకిరాంరెడ్డి గ‌తంలో అసిస్టెంట్ క‌న్జ‌ర్వేట‌ర్ ఆఫ్ ఫారెస్ట్స్ గా ప‌ని చేశార‌ని, ఎఫ్‌సీఆర్‌ఐకి ఆయ‌న సేవ‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు.

అంత‌ర్జాతీయ ప్రమాణాల‌తో తెలంగాణ రాష్ట్రంలో అటవీ కళాశాల, పరిశోధన సంస్థను ఏర్పాటు చేశార‌ని ఆబ‌ర్న్ యూనివ‌ర్సిటీ డీన్ జాన‌కి రాంరెడ్డి కొనియాడారు. ప్ర‌భుత్వం అట‌వీ సంర‌క్ష‌ణ‌, అభివృద్ది దిశ‌గా మంచి ప‌నులు చేస్తుంద‌ని ప్ర‌శంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం, సీయం కేసీఆర్ కు ఈ సంద‌ర్బంగా అభినంద‌న‌లు తెలిపారు. ఏంఓయూ వ‌ల్ల‌ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ దిశ‌గా అంత‌ర్జాతీయంగా వ‌స్తున్నమార్పుల‌ను అధ్య‌య‌నం చేసేందుకు ఈ రెండు సంస్థ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో అట‌వీ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజేశ్వ‌ర్ తివారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, సీయం ఓఎస్డీ ప్రియాంక వ‌ర్గీస్, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి పర్గెయిన్, ఎఫ్‌సీఆర్‌ఐ డీన్ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్, ఎఫ్‌సీఆర్‌ఐ ఫ్యాక‌ల్టీ సునీతా భగవత్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Indrakaran reddy on Telangana Education system…Indrakaran reddy on Telangana Education system

- Advertisement -