పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు ప్రజలకు ఓ మెరుగైన జీవనం కోసం స్వచ్చమైన గాలిని అందించడానికి హరితహార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం గండిరామన్న హరిత వనం (అర్బన్ ఫారెస్ట్ పార్క్) లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కలు నాటారు.
మార్నింగ్ వాక్ సందర్భంగా గత సంవత్సరం నాటిన మొక్కలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా అడవుల సంరక్షణ, అభివృద్దికి సీయం కేసీఆర్ అధిక ప్రాధన్యతనిస్తున్నారన్నారు. సీయం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అడవులను రక్షించడమే కాకుండా.. నగరాలు, పట్టణాలకు దగ్గరలో నిరూపయోగంగా ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
నగర, పట్టణ వాసులకు శారీరక ధారుడ్యం మానసికోల్లాసంతో పాటు ఆహ్లాద కరమైన వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులు (అటవీ ఉద్యానవనాలు) దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గండి రామన్న హరితవనం పార్కును రానున్న రోజుల్లో మరింత విస్తరించి, అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యావరణ సమతుల్యతను సాధించి, ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. ప్రతి ఒక్కరు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, సీఎఫ్ వినోద్ కుమార్, ఇతర అటవీ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.