వెస్టిండీస్ టూర్‌లో భాగంగా వన్డే,టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన టెస్టు సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. రేపటి నుంచి ప్రారంభంకాబోయే తొలి టెస్టు కూర్పు మేనేజ్‌మెంట్‌కి కష్టంగా మారింది.
ఆసీస్‌తో ఆరంగేట్ర టెస్టులోనే రాణించిన మయాంక్ అగర్వాల్ నుంచి రోహిత్ శర్మకు గట్టి పోటీ ఎదురవుతోంది. కొంతకాలంగా టెస్టుల్లో విఫలమవుతున్నాడు రోహిత్. ఈ నేపథ్యంలో ఓపెనింగ్ జోడిగా లోకేశ్ రాహుల్‌తో మయాంక్ అగర్వాల్‌ని పంపించే యోచనలో ఉంది మేనేజ్‌మెంట్. ఇక వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా పుజారా,నాలుగో స్ధానంలో కోహ్లీ బరిలోకి దిగనున్నారు.
ఇక ఐదో స్ధానంలో హనుమా విహారీ లేదా అజింక్య రెహానేలలో ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. గాయంతో టెస్టు సిరీస్‌కు దూరమైన ఆల్‌రౌండర్ హార్ధిక్ స్ధానంలో ఎవరిని తీసుకోవాలా అనే డైలమాలో మేనేజ్‌మెంట్ ఉండగా కీపర్‌గా సాహా లేదా పంత్‌లలో ఒకరిని తీసుకొనే అవకాశం ఉంది.
ఒకవేళ ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు,కీపర్‌లతో కలిపి ఏడుగురికి అవకాశం కల్పిస్తే ముగ్గురు పేసర్లు…?లేదా ఇద్దరు స్పిన్నర్లతో తుదిజట్టును ఖరారు చేయాలా అన్న మీమాంసలో ఉంది మేనేజ్‌మెంట్. మొత్తంగా తొలి టెస్టులో గెలుపే లక్ష్యంగా ఖరారు చేసే తుది జట్టు ఎలా ఉండనుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.