నేపాల్‌లో బుధవారం సంభవించిన భయంకర జలప్రళయంలో కనీసం 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గల్లంతవ్వగా వారిలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు తేలింది. ఈ తీవ్ర విపత్తుపై న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తూ, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటోంది.
నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ ఆకస్మిక వరదల వల్ల 800 మంది గల్లంతయ్యారని, వారిలో 300 మందికి పైగా భారతీయ పౌరులు ఉన్నారని తెలిపారు. హిమాలయ దేశవ్యాప్తంగా ఈ ప్రళయం అపార నష్టాన్ని మిగిల్చింది.వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోయాయి. ఇప్పటివరకు నష్టం తీవ్రతను పూర్తిస్థాయిలో అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని పేర్కొన్నారు.
భారత్, చైనాల మధ్య ఉన్న నేపాల్‌కి ప్రతిఏటా అధిక సంఖ్యలో భారతీయ పర్యాటకులు వెళ్తుంటారు. అంతకుముందు కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన 50 మందితో సహా 133 మంది భారతీయులు గల్లంతైనట్లు వార్తలు రాగా ఆ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగింది. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది. సహాయం కావలసిన వారి కోసం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది:
+977 985 131 6807
+977 970 910 7500
ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలెన్ షాతో ఫోన్‌లో మాట్లాడి…ఖాట్మండుకు భారత్ నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు భారత్ ఇప్పటికే టన్నుల కొద్దీ సహాయక సామగ్రిని నేపాల్‌కి పంపించింది. భారత్ పంపిన మానవతా సాయంపై నేపాల్ విదేశాంగ మంత్రి ఖనాల్ ‘X’ (ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కష్టసమయంలో భారత్ స్పందించిన వేగం ఇరుదేశాల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
సరిహద్దు రాష్ట్రాల్లో ఆందోళన – ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి
నేపాల్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో, దానికి ఆనుకుని ఉన్న భారత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లకు అలర్ట్ జారీ చేశారు. తదుపరి 24 గంటలు అత్యంత కీలకమని అధికారులు తెలిపారు.
Also Read:జలప్రళయం..ఆ రాష్ట్రాలకు అలర్ట్!
నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవహించే నదుల నీటిమట్టాలను పర్యవేక్షించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలను రంగంలోకి దించారు.
ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, “కేంద్ర జల సంఘం (CWC) గండక్ నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి” అని పీటీఐకి తెలిపారు.

