రైల్వే ప్రయాణికులకు శుభవార్త

5
- Advertisement -

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు, RailOne యాప్ ద్వారా ఏదైనా డిజిటల్ పేమెంట్ మోడ్ ఉపయోగించి అన్‌రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఇది ప్రస్తుతం యాప్‌లో R వాలెట్ చెల్లింపులపై మాత్రమే ఉన్న 3% క్యాష్‌బ్యాక్‌కు అదనంగా ఉంటుంది.

డిసెంబర్ 30, 2026 తేదీతో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS)కు పంపిన లేఖలో, ఈ డిస్కౌంట్ అమలు కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను చేపట్టాలని మంత్రిత్వ శాఖ సూచించింది. డిజిటల్ బుకింగ్‌ను విస్తరించేందుకు RailOne యాప్‌లో అన్ని డిజిటల్ పేమెంట్ మోడ్‌ల ద్వారా అన్‌రిజర్వ్డ్ టికెట్లు బుక్ చేసేటప్పుడు 3% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించాం అని లేఖలో పేర్కొంది.

ఈ ప్రతిపాదన 14.01.2026 నుంచి 14.07.2026 వరకు అమల్లో ఉంటుందని, మే నెలలో CRIS నుంచి అభిప్రాయం తీసుకుని తదుపరి పరిశీలన చేస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. R వాలెట్‌పై ఉన్న 3% క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుంది అని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రయోజనం కేవలం RailOne యాప్‌లోనే వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం R వాలెట్ ద్వారా చెల్లింపులపై 3% క్యాష్‌బ్యాక్ ఉంది. కొత్త ఆఫర్‌లో మాత్రం అన్ని డిజిటల్ పేమెంట్ మోడ్‌లకు 3% డిస్కౌంట్ ఇస్తాం. ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇది వర్తించదు అని ఓ అధికారి వివరించారు.

రాబోయే ఐదేళ్లలో ప్రధాన నగరాల నుంచి ప్రారంభమయ్యే రైళ్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది. 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు అదనపు ప్లాట్‌ఫారమ్‌లు, కొత్త టెర్మినల్స్, మెయింటెనెన్స్ సదుపాయాలు (మెగా కోచింగ్ కాంప్లెక్సులు) నిర్మించడం, సెక్షనల్ సామర్థ్యాన్ని పెంచే పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read:AI Helmet:బెంగళూరు యువకుడి ఆవిష్కరణ

 

- Advertisement -