పాక్ భూభాగంపై భారత కమాండోల దాడి

269
ndian Army commandos cross LoC
- Advertisement -

భారత సైన్యం పాకిస్తాన్‌ భూభాగంలోకి చొరబడి దాడులు నిర్వహించిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ తెలిపారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరిగిందని సింగ్ అన్నారు. పాకిస్తాన్ భారత్‌ సరిహద్దు ప్రాంతమైన నియంత్రణ రేఖ దాటి సుశిక్షిత భారత కమాండోలు దాడులు జరిపి 8 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లు సమాచారం. పాకిస్థాన్, ఉగ్రవాదుల నుంచి తలెత్తే ఎటువంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కునేందుకు భారత ఆర్మీ సిద్ధంగా ఉందని విదేశాంగ ర‌క్ష‌ణ శాఖ, భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

ranbeer singh DGMO

గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో రణబీర్ సింగ్ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి కమాండోలు పీఓకేలో దాడులు జరిపి ఎలాంటి నష్టం లేకుండా తిరిగి భారత్‌ కు వచ్చాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌, ఆర్మీ ఛీఫ్‌ దల్బీర్ సింగ్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌లు స్వయంగా పర్యవేక్షించారన్నారు. గత రాత్రి ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు తాను స్వయంగా పాకిస్థాన్ డీజీఎంఓకు ఫోన్ చేసి వివరించినట్లు సింగ్ పేర్కోన్నారు. ఈ ఆపరేషన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ పాల్గోనలేదని వెల్లడించారు.

మరోవైపు.. భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చెప్పారు. శాంతి కావాలని కోరుకుంటున్న తమ విధానాన్ని తమ బలహీనతగా భావించకూడదని ఆయన అన్నారు. తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు.

ప్రధాని మోడీ ఈ దాడుల గురించి గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తదితరులకు సమాచారం అందించారు.

కాగా, నవంబర్‌లో పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు తామూ హాజరుకాబోవడం లేదని భారత్‌ స్ఫష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్‌కు మద్దతుగా అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు కూడా సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు తామూ హాజరుకాబోవడం లేదని బుధవారం ప్రకటించాయి. సదస్సు విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్టించిందని ఆ దేశం పేరు ప్రస్తావించకుండా మండిపడ్డాయి. ఉడీ ఉగ్రవాద దాడి, సీమాంతర చొరబాట్ల నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లకూడదని భారత్ మంగళవారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దేశాలు పై నిర్ణయం తీసుకున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో ఒక సార్క్ దేశం(పాక్) మితిమీరిన జోక్యం వల్ల సమావేశం విఫలమయ్యే పరిస్థితి నెలకొందని బంగ్లాదేశ్ పేర్కొంది. ప్రాంతీయంగా ఉగ్రవాద సమస్య వల్ల గైర్హాజరవుతున్నట్లు అఫ్గాన్ తెలిపింది.

- Advertisement -