వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో ఇండియా విజయం సాధించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది భారత్. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 167పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 67పరుగులు చేసి భారత్ కు అండగా నిలిచాడు. శిఖర్ ధవన్ 23, కోహ్లీ 28, కృనాల్ పాండ్యా 20 పరుగులు చేశాడు.
168 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ తన బ్యాటింగ్ తీరును ఏమాత్రం మార్చుకోలేదు. ఆటగాళ్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగారు. 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విండీస్‌ను నికోలస్ పూరన్ (19), రోవ్‌మన్ పావెల్ (54) ఆదుకున్నారు.
దీంతో పుంజుకున్నట్టే కనిపించింది. అయితే, 84 పరుగుల వద్ద వెంటవెంటనే వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో మరోమారు కష్టాల్లో కూరుకుపోయింది. 15.3 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి విండీస్ స్కోరు 98/4. మ్యాచ్‌ను తిరిగి కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో భారత జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు.