సండే సమరం.. !

250
India vs Pakistan Final
India vs Pakistan Final
- Advertisement -

ఛాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం హై ఓల్టేజ్ మ్యాచ్‌కు లండన్‌లోని ఓవల్ వేదిక కానుంది. మినీ వరల్డ్‌కప్‌ అసలు సిసలు సమరం ఫైనల్లో  చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లీగ్‌ దశలో పాక్‌ను మట్టికరిపించిన భారత్ మరోసారి దాయాదిని ఓడించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించేందుకు ఉవ్విళ్లూరుతోంది.

నేడు జరగనున్న బిగ్ ఫైట్ కి సిద్ధమయినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. ఫైన‌ల్‌లో ఉత్తమ ప్రదర్శన ఇవ్వ‌డానికి ఆట‌గాళ్లంతా ఉవ్విళ్లూరుతున్నార‌ని.. గెలుపు కోసం పాక్‌, భార‌త్‌ జట్లు శ‌క్తిమేర‌కు పోరాడతాయని అన్నాడు.

ఇక భారత్-పాక్ జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ రికార్డులకు ఎక్కనుంది. నేడు ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో క్రికెట్ చరిత్రలో అతి ఎక్కువమంది వీక్షించిన మ్యాచ్‌లలో ఈ మ్యాచ్‌ నిలవబోతుందని అంచనా..  2011లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన వరల్డ్ కప్‌ ఫైనల్‌ను 55.8 కోట్ల మంది వీక్షించారు. అదే టోర్నీలో భారత్-పాక్ మధ్య జరిగిన సెమీస్ పోరును 49.5 కోట్ల మంది చూశారు. ఈ రెండే ఇప్పటి వరకు ఒకటి, రెండు స్థానాల్లో ఉండగా ఇప్పుడు చాంపియ్స్ ట్రోఫీ ఫైనల్ గత రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా.

ఇటు బ్యాటింగ్,బౌలింగ్‌లో రాణిస్తు కదనోత్సాహంతో ఉన్న కోహ్లీ సేన… ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న పాకిస్థాన్ షాక్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. కోహ్లీ కెప్టెన్ గా తొలి ఐసీసీ టోర్నీ ఫైనల్ ఆడబోతున్నాడు. కెప్టెన్ గా ధోనికి కూడా మొదట ఐసీసీ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్ తోనే మ్యాచ్ ఆడాడు. 2007 టీ 20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పైనే మ్యాచ్ గెలిచి.. కప్ సాధించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ కు చేరడం ఇది నాలుగోసారి. 2000 సంవత్సరంలో రన్నరప్ గా నిలిచిన భారత్… 2002, 2013లో కప్ సాధించింది.

India vs Pakistan Final
ఐసీసీ నిర్వహించే మ్యాచుల్లో భారతే ఎప్పుడూ ఫేవరెటే. ఇప్పుడు కూడ మ్యాచ్ గెలిచేందుకు టీమిండియాకే ఎక్కువ అవకాశాలున్నాయి. కోహ్లీ, రోహిత్, ధావన్, యువీ, ధోనీ… ఇలా టాప్ ఆర్డర్ మొత్తం ఫామ్ లోనే ఉంది. ఇక బుమ్రా, భువనేశ్వర్, హార్థిక్ పాండ్య పర్వాలేదనిపిస్తున్నారు. బౌలింగ్ లో ఇంకొంచెం కష్టపడితే… మరోసారి విజయ కేతనం ఎగరవేయొచ్చు అంటున్నారు విశ్లేషకులు.

మరోవైపు  పాకిస్థాన్ కూడా కోహ్లీసేనతో మ్యాచ్ ఓడిపోయినా… తర్వాత సత్తా చాటింది.  బౌలింగ్ బలంతో ఫైనల్ చేరిన పాకిస్థాన్ మూడు వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది. దీంతో… టైటిల్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. ఇక ఈ మ్యాచ్‌పై నెటిజన్లు ఆసక్తి కరమైన కామెంట్స్ చేస్తున్నారు.  టైటిల్ పోరులో భారత్ చేతిలో పాక్ ఓడిపోవడం ఖాయమని కామెంట్లు పోస్టు చేస్తున్నారు. మరికొంతమంది  పాక్ ఆటగాళ్లకు స్వదేశంలో ఎలాంటి స్వాగతం లభిస్తుందో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆదివారం జరగనున్న మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందు లాంటిదని భావిస్తున్నారు. ఈ సండే బ్లాక్ బస్టర్ సండే కానుందని  కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -